
బాలీవుడ్లో ‘ఆషికీ’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు రాహుల్ రాయ్ (52) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. మంచు ప్రాంతమైన కార్గిల్‌లో షూటింగ్లో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో నటుడిని హుటాహుటిన స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ముంబయికి తీసుకువచ్చారు. భారత సైనికుల పోరాటం నేపథ్యంగా తెరకెక్కుతున్న ‘ఎల్ఓసీ: లివ్ ది బ్యాటిల్ ఇన్ కార్గిల్’ చిత్రం కోసం రాహుల్ రాయ్ కార్గిల్ షూటింగ్లో పాల్గొంటున్నారు. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. సైనికాధికారుల సాయంతో రాహుల్రాయ్ను హెలికాప్టర్లో శ్రీనగర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నటుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 20 ఏళ్ల క్రితమే బాలీవుడ్లో అడుగుపెట్టిన రాహుల్.. మహేష్ భట్ నిర్మించిన ఆషికీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. జునూన్, ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ సినిమాల్లో నటనకు ప్రశంసలందుకున్నారు. 2006లో ప్రారంభమైన టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో పాల్గొని ఆ సీజన్ విజేతగా నిలిచారు.