పాపం.. రణ్‌వీర్‌ను బ్యాటుతో బాదేస్తోంది!!

పెళ్లై ఇంకా ఏడాది కూడా గడవలేదు. పాపం అప్పుడే రణ్‌వీర్‌ సింగ్‌ను క్రికెట్‌ ఆడేస్తోంది ఆయన సతీమణి దీపిక పదుకొణె. ఆమె బ్యాటు పట్టుకోని రణ్‌వీర్‌ను కొడుతున్న దృశ్యాలు చూసైతే.. ‘అయ్యో పాపం పెళ్లి చేసుకొని గల్లీబాయ్‌ ఎంత తప్పు చేశాడో కదా..’ అంటూ జాలి చూపుతున్నారు నెటిజన్లు. అయితే ఇదంతా సీరియస్‌గా చేసింది కాదులేండి. ప్రస్తుతం రణ్‌వీర్‌ ‘83’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కపిల్‌ పాత్రను రణ్‌వీర్‌ పోషిస్తుండగా.. ఆయనకు భార్యగా దీపిక నటిస్తోంది. పెళ్లి తర్వాత దీప్‌వీర్‌లు జంటగా నటిస్తోన్న తొలి చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం 2020 వేసవికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ ఓ వైపు సెట్స్‌పై ఉండగానే.. ఇప్పటి నుంచే చిత్ర ప్రమోషన్స్‌ను షురూ చేసేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ ఇలా సరదా వీడియోలతో నెట్టింట అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా తనను దీపిక బ్యాటుతో కొడుతున్న వీడియోను రణ్‌వీర్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘స్టోరీ ఆఫ్‌ మై లైఫ్, రియల్‌ అండ్‌ రీల్‌’’ అంటూ ఓ సరదా వ్యాఖ్యను జత చేశారు. ఈ వీడియోలో దీపిక.. రణ్‌వీర్‌ను బ్యాటుతో బాదుతుంటే.. దానికి ఆయన ఇచ్చిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.