‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో విలన్‌ కాదు.. హీరో కన్నా పవర్‌ఫుల్‌

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రాల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాల్లో కథానాయకుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. ప్రతినాయక, సహాయక పాత్రలకీ అంతే ప్రాధాన్యత ఉంటుంది. కొన్నిసార్లు కథానాయకుడి చుట్టూ ఉన్న పాత్రలే హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఆయన సినిమాల్లో ప్రతి పాత్రకు హీరో స్థాయి ప్రాధాన్యత కనిపిస్తుంటుంది. దీనికి ఉదాహరణే.. ‘బాహుబలి’లోని శివగామి, కట్టప్ప తదితర పాత్రలు. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న ప్రతిష్ఠాత్మక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసమూ ఇదే పంథాలో నడబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తోన్న ఈ చిత్రంలో వారిద్దరి పాత్రల స్థాయిలోనే బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌కూ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మన్యం వీరుడు అల్లూరి, గిరిజన వీరుడు కొమరం భీమ్‌ల జీవితకథతో ఓ ఫిక్షనల్‌ కథగా జక్కన్న దీన్ని చెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీళ్లతో పాటు ఇందులో మరో స్వాతంత్య్ర వీరుడు కూడా దర్శనమివ్వబోతున్నాడట. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అజయ్‌ దేవగణ్‌ పోషించబోయే పాత్ర అదేనట. నిన్నమొన్నటి వరకు ఆయనీ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, అది వాస్తవం కాదని.. ఆయన చిత్ర హీరోలకు విప్లవ పాఠాలు బోధించే ఓ పవర్‌ఫుల్‌ స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రను పోషిస్తోన్నట్లు సమాచారం. ఇంతకీ ఆ పోరాట వీరుడు మరెవరో కాదు.. భగత్‌ సింగ్‌. ఇప్పుడీ పాత్రలోనే దేవగణ్‌ కనిపించి కొమరం భీమ్, అల్లూరిలకు విప్లవ పాఠాలు బోధించి స్వాతంత్య్ర పోరాటానికి వాళ్లను సన్నద్దం చేస్తాడట. నిజానికి ఈ పాత్ర కోసం రాజమౌళి అజయ్‌నే ఎంచుకోవడానికి మరో కారణమూ ఉంది. అదేంటంటే.. ఇప్పటికే ఆయన ‘ది లెజండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌’ చిత్రంలో ఈ అమరవీరుడి పాత్రను పోషించి మెప్పించారట. ఈ సినిమాకు బాలీవుడ్‌లో మంచి విజయం కూడా దక్కింది. అందుకే ఆ పాత్రను మళ్లీ దేవగణ్‌తోనే చేయిస్తే.. ఉత్తరాది ప్రేక్షకులకూ ఈజీగా కనెక్ట్‌ అయ్యే అవకాశముంటుందని భావించారట దర్శకధీరుడు. మరి సినిమాలో అల్లూరి - భీమ్‌లతో భగత్‌ సింగ్‌ స్నేహ బంధం ఎలా ఉండబోతుంది? వీళ్ల ముగ్గురి కలయికలో సన్నివేశాలు ఏ స్థాయిలో పేలనున్నాయి? అన్నది తెలియాలంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.