సల్మాన్‌ మీద ప్రేమతో పోటీ నుంచి తప్పుకొన్నారు
ఈద్‌ అంటే పండగ మాత్రమే కాదు.. సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా విడుదల రోజు కూడా అంటే అతిశయోక్తి కాదు. 2009 నుంచి 2019 వరకూ 2013 మినహా ఏటా ఈద్‌ కానుకగా సల్మాన్‌ చిత్రం విడుదలైంది. ఈ ఏడాది ఈద్‌కు ‘భారత్‌’ వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఈద్‌కు కూడా సల్మాన్‌ చిత్రం సిద్ధమవుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వలో సల్మాన్‌ నటిస్తున్న ‘ఇన్‌షా అల్లా’ ఈద్‌ సీజన్‌లో రాబోతోంది. అయితే అదే సమయంలో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న ‘సూర్యవంశీ’ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం కొద్దిరోజుల కిందట ప్రకటించింది. దీంతో సల్మాన్, అక్షయ్‌ల మధ్య పోటీ తప్పదని అనుకున్నారు. అయితే ఈ పరిస్థితిని తప్పించడానికి ‘సూర్యవంశీ’ని కాస్త ముందుగానే విడుదల చేయాలని ఆ చిత్రబృందం తాజాగా నిర్ణయించింది. ‘‘కిలాడీ, బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ కలసి మార్చి 27నే ‘సూర్యవంశీ’తో వస్తున్నారు. సల్మాన్‌కు ప్రేమతో..’’ అని చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ ట్వీట్‌ చేశారు. సల్మాన్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. రోహిత్‌ శెట్టితో కలసి ఉన్న ఫొటోను ట్విటర్‌లో పంచుకుంటూ ‘‘రోహిత్‌ను ఎప్పటికీ నా తమ్ముడిగానే భావించాను. అది నిజమే అని ఈరోజు తను నిరూపించాడ’’ని ట్వీట్‌ చేశారు సల్మాన్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.