‘గన్స్‌ ఆఫ్‌ నార్త్‌’ నుంచి తప్పుకున్నాడా?

బాలీవుడ్‌ యువ నటుడు, సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పిత భర్త ఆయుష్‌ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న చిత్రం ‘గన్స్‌ ఆఫ్‌ నార్త్‌’. పంజాబీ చిత్రం ‘ముల్షీ పెట్రన్‌’కు హిందీ రీమేక్‌ ఇది. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు. ఓ 20 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో సల్మాన్‌ కనిపిస్తారని ముందు అనుకున్నారు. తర్వాత సల్మాన్‌ పాత్ర నిడివి పెంచాలనుకున్నారు. ఇందులో భాగంగా కథలో చాలా మార్పులు చేశారు. స్క్రిప్టు పూర్తిగా సిద్ధమయ్యాకా చూసుకుంటే అసలు మొత్తం కథే మారిపోయినట్టు అనిపించిందట చిత్రబృందానికి. దీంతో ఒరిజినల్‌ కథనే తీయాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ ఈ చిత్రం నుంచి తప్పుకొన్నట్టు సమాచారం. దీంతో పాటు ఈ చిత్ర దర్శకుడూ మారారు. ఈ చిత్ర దర్శకుడు అభిరాజ్‌ మినావాలాకు బదులుగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ‘మల్షీ పెట్రన్‌’లో కీలక పాత్రలో నటించారు మంజ్రేకర్‌. కరోనా పరిస్థితులు కొంచెం కుదుటపడ్డాకా ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, ఒరియా భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.