కత్రినాకు నేను అన్నయ్యను కాను: సల్మాన్‌

‘‘కత్రినా కైఫ్‌కు తాను అన్నయ్యను కాన’’ని అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌. ప్రస్తుతం ఆయన కత్రినాతో కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. జూన్‌ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘జిందా..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కత్రినాకు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘కత్రినా.. ‘భాయ్‌జాన్‌’ సల్మాన్‌తో కలిసి మరోసారి నటించడం మీకెలా అనిపిస్తోంది?’’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. అయితే దీనికి సల్మాన్‌ సమాధానమిస్తూ.. ‘సర్‌.. నేను కత్రినాకు ‘భాయ్‌జాన్‌’ (అన్నయ్య)ను కాను’’ అని చెప్పి నవ్వులు పూయించారు. ఆ వెంటనే సదరు విలేకరి ఈ జవాబుకు కొనసాగింపుగా క్యాతీని మరో ప్రశ్న అడిగారు. ‘‘మీరు సల్మాన్‌ను భాయ్‌జాన్‌ అనడం ఆయనకు నచ్చడం లేదు. మరి ఆయన్ను మీరు ఏమని పిలవాలనుకుంటున్నారు?’’ అని అడిగారు. దీనికి కూడా సల్మానే బదులిస్తూ.. ‘‘నన్ను కత్రినా ‘భాయ్‌జాన్‌’ అని పిలవదు. కానీ, ‘మేరీజాన్‌’ అని పిలుస్తుంది’’ అని తనదైన శైలిలో కౌంటరిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.