నేనా..హీరోనా...!
షారుఖ్‌ఖాన్‌ అమ్మాయిల కలల రాకుమారుడు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న స్టార్‌ హీరో. షారుఖ్‌ వెండితెరకొచ్చిన కొత్తలో ‘రాజు బన్‌గయా జెంటిల్‌మేన్‌’ అనే చిత్రంలో నటించారు. అందగాడు, గొప్పనటుడు అంటూ అందరూ మెచ్చుకునే షారుఖ్‌కు ‘రాజు బన్‌గయా జెంటిల్‌మేన్‌’ చిత్రీకరణ కొంత పూర్తయ్యాకా రషెష్‌ చూసుకున్నాకా తనకు తానే నచ్చలేదట. ‘‘రాజు బన్‌గయా జెంటిల్‌మేన్‌’ రషెష్‌ చూసుకున్నాకా అందులో నా ముఖం, చింపిరి జుట్టు చూసుకొని ఛీ.. నేను హీరో ఏంటి? అనిపించింది. నానా పటేకర్‌. అమృతా సింగ్, జుహీ చావ్లా లాంటి నటుల పక్కన చెత్తగా నటించాను అనిపించింది. తరువాత రోజు ఉదయం ఫ్లైట్‌కు వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ చిత్ర దర్శకుడు అజీజ్‌ మిర్జా, జుహీ చావ్లా నన్ను ఆపేశారు. ‘నువ్వు అనుకుంటున్నంత చెత్తగా ఏమీ నటించలేదు. సినిమా పూర్తయ్యేసరికి అంతా బాగానే వస్తుందంటూ సర్దిచెప్పారు. ఇక్కడి పీవీఆర్‌ అనుపమ్‌ థియేటర్‌లో నాటకాలు వేసిన సమయంలో పీవీఆర్‌ ఛైర్మన్‌ అజయ్‌ బిజిలీ కూడా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. కానీ అజీజ్, అజయ్‌ ఇద్దరూ అబద్దమే చెప్పారు. నేను ఎప్పటికీ గొప్పగా కనిపించలేదు. కనిపించను’’ అంటూ తన కెరీర్‌ తొలినాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు షారుఖ్‌. దేశంలో తొలి మల్టీప్లెక్స్‌ పీవీఆర్‌ అనుపమ్‌ని రెన్నోవేషన్‌ చేయడానికి మూసేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి షారుఖ్‌ హాజరయ్యారు.


ఐదు నక్షత్రాల హోటల్‌లో ఓ థియేటర్‌
:
షారుఖ్‌ పుట్టి పెరిగింది దిల్లీలోనే. ఈ నగరంతో తనది విడదీయరాని అనుబంధం అని చెప్పారు. తను ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగి ముంబయిలో ఉంటున్నా ఎప్పటికీ దిల్లీ కుర్నాణ్నే అని చెప్పారు షారుఖ్‌. ‘‘అనుపమ్‌ థియేటర్‌లో టిక్కెట్ల కోసం పడిగాపులు కాసేవాణ్ని. ఇక్కడ దగ్గర్లోనే నా భార్య గౌరీ ఇల్లు ఉండేది. ఆమెను ప్రేమలో పడేయడానికి కోసం ఈ థియేటర్‌ పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టేవాణ్ని’’ అన్నారు షారుఖ్‌. ‘ఐదు నక్షత్రాల హోటల్‌లో ఓ థియేటర్‌కు అధిపతిని కావాలనేది నా చిరకాల కోరిక’అని ఈ సందర్భంగా తన మనసులో మాట బయటపెట్టారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.