చైనీస్‌ చిత్రంలో నటించాలి!

ఇప్పటికైనా ఓ చైనీస్‌ చిత్రంలో నటించాలని ఉందంటున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు షారుఖ్‌ఖాన్‌. ఆయన నటించిన ‘జీరో’ చిత్రం బీజింగ్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. షారుఖ్‌ ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి చైనా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇండియా- చైనాల్లోని సూపర్‌ హీరోలతో కథాంశంతో ఓ సినిమా చేయాలనేది నా కల. అది నెరవేరే సమయం వస్తే మాండరిన్‌ భాషను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరో ఒకరు నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం నాకు ఇష్టం లేదు. నటించడమే కాదు అవకాశం ఉంటే చైనీస్‌ చిత్ర నిర్మాతలతో కలసి నిర్మించడానికీ సిద్ధమే’’ అని చెప్పారు. సినిమా భారత్‌ - చైనా సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు షారుఖ్‌. ‘‘భారత్‌- చైనాల్లో సంస్కృతి సంప్రదాయాలు ఎంతో కీలకమైన విషయం. రెండు దేశాల మధ్య చక్కటి వాతావరణం ఏర్పడటానికి సినిమా ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు. చైనీస్‌ చిత్రం ‘‘ది వాండరింగ్‌ ఎర్త్‌’ గురించి అక్కడి విలేకరులు అడగ్గా ‘‘ఈ సినిమా గురించి ఎంతో విన్నాను. తొందర్లోనే ఈ సినిమా చూస్తాను’’ అని చెప్పారు షారుఖ్‌. బీజింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రమంలో షారుఖ్‌ను కలుసుకోవడానికి పెద్ద ఎత్తున చైనా అభిమానులు తరలివచ్చారు. ఆయన్ని చూడాలని అక్కడకు 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్‌వెస్ట్‌ చైనా నుంచి కూడా అభిమానులు రావడం విశేషం. జీరో చిత్రం గురించి మాట్లాడుతూ ‘‘జీరో’ భారతీయ ప్రేక్షకులకు నచ్చలేదు. మరి ఈ సినిమా చూశాకా చైనా ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి. బహుశా వాళ్లకు నచ్చుతుందనుకుంటున్నా’’ అన్నారు షారుఖ్‌.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.