కంటినిండా నిద్ర కూడా ఉండట్లేదు: శ్రద్ధా
శ్రద్ధాకపూర్‌.. బాలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ కథానాయిక. గత ఏడాది ఈమె నుంచి రెండు చిత్రాలొచ్చాయి. ప్రస్తుతం శ్రద్ధా మూడు చిత్రాలతో బిజీగా ఉంది. ‘సాహో’, ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ’... ఈ మూడూ వేటికవే భిన్నమైన చిత్రాలు. ఈ మూడు సినిమాల షూటింగ్‌ల మధ్య తిరుగుతోంది శ్రద్ధ. ఓ పాత్రలో లీనమై బయటకొచ్చి మరో కొత్త పాత్రలో దూరిపోవాలి. ఇది కొంచెం కష్టమైన పరిస్థితే శ్రద్ధకు. మరి దీని గురించి శ్రద్ధ ఏమంటుందంటే... ‘‘నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూశాను. మూడు విభిన్నమైన పాత్రలంటే మూడు కొత్త ప్రపంచాలే. ఒకే జీవితంలో ఇన్ని జీవితాల్ని అనుభవించే అవకాశం రావడం నా అదృష్టం. అందరికీ ఇలాంటి అవకాశం రాదు కదా. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారడానికి కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. కానీ ఆ మాత్రం కష్టం లేకపోతే నాకు థ్రిల్‌ ఏముంటుంది?’’ అంటోంది. ‘‘ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం కష్టంగానే ఉంది. ఒక్కోసారి కంటినిండా నిద్ర కూడా ఉండటం లేదు. మెడిటేషన్‌ ద్వారా ఆ లోటును భర్తీ చేస్తున్నాను. నటులకు మంచి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. ఇదిగో ఒక్కోసారి ఇలా ఒకేసారి వచ్చేస్తాయి. అప్పుడు కష్టం తప్పదు. అదృష్టం మూడుసార్లు తలుపుతడితే ఒక్కసారే తీస్తానంటామా... సినిమా అవకాశాలు కూడా అంతే’’ అని చెప్పింది శ్రద్ధ.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.