నాకు తెలిసిన మెగాస్టార్‌ ఆయనొక్కరే..

వైపు టాలీవుడ్‌ మెగాస్టార్‌.. మరోవైపు బాలీవుడ్‌ మెగాస్టార్‌.. ఈ ఇద్దరినీ ఒక్కటిగా వెండితెరపై చూస్తే అభిమానుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో రానున్న ‘సైరా’ చిత్రంతో తెరపై ఈ కనులవిందును దర్శించుకునే భాగ్యం కలిగింది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో.. అమితాబ్‌ చిరుకు గురువుగా ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘సైరా’ టీజర్‌ రిలీజ్‌ వేడుకలో ఈ అంశంపై మాట్లాడుతూ బిగ్‌బిపై ప్రశంసలు కురిపించారు. ‘‘ఇద్దరు మెగాస్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. అమితాబ్‌తో మీ వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది’’ అని చిరును ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘నా దృష్టిలో బిగ్‌బీనే రియల్‌ మెగాస్టార్‌’’ అంటూ బదులిచ్చారు చిరు. ‘‘అమితాబ్‌ నా జీవిత మార్గదర్శి. నాకు ఆయన మాత్రమే మెగాస్టార్‌. ‘సైరా’లో నా పాత్రకు గురువుగా అమితాబ్‌ చేస్తే బాగుంటుందని సురేందర్‌ నాతో చెప్పాడు. వెంటనే నేను బిగ్‌బికి ఫోన్‌ చేసి ఇది విషయం అని చెప్పా. వారం ఆలోచించుకోని మీ నిర్ణయం చెప్పినా పర్లేదన్నా. కానీ, ఆయన వెంçనే చేస్తానని మాటిచ్చారు. ముందు దర్శకుడిని పంపి కథ వినిపించండన్నారు. ఆ తర్వాత నాతో కలిసి షూట్‌లో పాల్గొన్నారు. ఆయనతో కలిసి ఓ సినిమా చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇండియన్‌ మెగాస్టార్‌ గారికి నా కృతజ్ఞతలు’’ అంటూ ముగించారు. ఇక చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ఈ చిత్రంతో నా  ఎన్నో ఏళ్ల కల నెరవేరినట్లయిందని, ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన బెస్ట్‌ కంటెంట్‌ ఉంది కాబట్టే దేశంలోని వివిధ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటించడం కాస్త కష్టంగా అనిపించిందన్నారు. ‘‘ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, గ్రాఫిక్స్‌ ఉపయోగించమని చెబితే.. సురేందర్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ ఏ మాత్రం ఒప్పుకోలేదు. నిజానికి నా భుజానికి ఆపరేషన్‌ జరిగింది. అయినా సరే.. వీళ్లు నన్ను వదల్లేదు (నవ్వుతూ). నాతో కత్తిసాము, గుర్రపుస్వారీ చేయించారు. నిజానికి నాకు శ్రమించడం అంటే ఇష్టం. ఈ ప్రయాణాన్ని చాలా ఎంజాయ్‌ చేశా. సినిమా అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది’’ అని చిరు పేర్కొన్నారు. 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.