రోమి దేవ్‌గా దీపికా పదుకొణెను చూశారా!

ప్రముఖ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘83’. రన్వీర్‌ సింగ్‌ కపిల్‌గా నటిస్తుండగా, ఆయన భార్య రోమి దేవ్‌గా నటి దీపికా పదుకొణె నటిస్తోంది. తాజాగా దీపికా పదుకొణె ఫోస్టర్‌ని చిత్రం బృందం విడుదల చేసింది. దర్శకుడు కబీర్‌ మాట్లాడుతూ ‘‘తొలుత కపిల్‌ భార్య పాత్రలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఆలోచించాను. నా మనసుకు ఎవరూ తట్టలేదు. కానీ దీపికాను తలుచుకోగానే సరిగ్గా సరిపోతుందని అనిపించింది. అందులోను రన్వీర్‌ - దీపికాలు నిజజీవితంలోనూ భార్యాభర్తలు, వారి మధ్య మంచి కెమిస్ట్రీ పండుతుందని భావించి సంప్రదించాను’’ అని చెప్పాడు. చిత్రం గురించి దీపికా మాట్లాడుతూ ‘‘చిత్రంలో నేను నా పాత్ర చిన్నదే అయినా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇది క్రికెట్‌కి సంబంధించింది. నిజంగా నేను ఒక ఆటగాడి కుటుంబంలో పెరిగా. అందులోని సాధకబాధకాలేంటో తెలుసు. నాన్న ప్రకాష్‌ పదుకొణె విజయం కోసం అమ్మ ఎంతో ధైర్యంగా నిలబడేది. ఆయన ప్రతి విజయంలో అమ్మ సహకారం ఎంతో ఉంది. అందుకే నేను కూడా ఈ పాత్రలో నటించాలి అనిపించింది’’ అంటూ చెప్పింది. చిత్రంలో జీవా, బొమన్‌ ఇరానీ, పార్వతీ నాయర్‌ తదితరులు నటిస్తున్నారు. ఇది ఏప్రిల్‌ 10న తెరపైకి రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.