వెండితెరపైకి.. ఇండియా మిస్సైల్‌ మ్యాన్‌

హాత్మగాంధీ తర్వాత అంతటి స్థాయిలో దేశియంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు ఏపీజే అబ్దుల్‌ కలాం. ముఖ్యంగా భారతీయ అంతరిక్ష రంగం, రక్షణ రంగాల అభివృద్ధిలో కలాం వేసిన ముద్ర ఎంతో ప్రత్యేకం. అందుకే ఆయన్ని మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇండియాగా కీర్తిస్తారు. ఇప్పుడీయన జీవితగాథ వెండితెరపైకి రాబోతుంది. త్వరలోనే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నట్లు నిర్మాతలు రామబ్రహ్మం సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇందుకోసం వీరు ఇప్పటికే కలాం కుటుంబ సభ్యుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నారట. 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్దుల్‌ కలాం.. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను, సవాళ్లను ఛేదించి దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు రూపొందించనున్న ఈ బయోపిక్‌లో కలాం జీవితం ప్రయాణంలోని అనేక ముఖ్య ఘట్టాలను చూపించబోతున్నారట. ఆయన తన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? వాటి నుంచి బయటపడి అవకాశాలను ఎలా సొంతం చేసుకున్నారు? వంటి స్ఫూర్తిదాయక అంశాలతో ఈ బయోపిక్‌ను తీర్చిదిద్దనున్నారట. దీన్ని తెరకెక్కించబోయే దర్శకుడెవరు? టైటిల్‌ పాత్రను ఎవరు పోషిస్తారు? తదితర విషయాల్ని త్వరలోనే ప్రకటిస్తారట.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.