అక్షయ్‌ బర్త్‌డే కానుక అదిరిందిగా..

బాలీవుడ్‌ స్టార్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ తన 52వ జన్మదినాన్ని పురస్కరించుకోని ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. కొత్తగా మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 1178 నుంచి 1192 మధ్య కాలంలో అజ్మేర్‌, దిల్లీ ప్రాంతాలను పాలించిన మహారాజా పృథ్విరాజ్‌ చౌహాన్‌ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఇది నా కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రం. బాలీవుడ్‌లోనే అతిపెద్ద బయోపిక్‌గా ఈ చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది’’ అంటూ ఓ వ్యాఖ్యను కూడా జత చేశారు. ఇక ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత దేశానికి చెందిన పరాక్రమవంతులైన రాజుల్లో పృథ్విరాజ్‌ చౌహాన్‌ ఒకరు. ఆయన ఎన్నో తరాలకు స్ఫూర్తి. ఆ పాత్రను ఇప్పుడు నేను పోషించబోతుండటం ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి రియల్‌ హీరోల విజయాలను మనమంతా పండుగలా జరుపుకోవాలి. నా పుట్టినరోజు నాడే ఈ చిత్రాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని అన్నారు. దీన్ని చంద్రప్రకాశ్‌ ద్వివేదీ దర్శకత్వం వహించనున్నాడు. ఆయన గతంలో బుల్లితెరపై చాణక్య అనే ధారావాహికను రూపొందించారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం అక్షయ్‌ ‘లక్ష్మీబాంబ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘సూర్యవంశీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.