ఆలియా ‘ఓ బేబీ’గా మారనుందా??

కొరియన్‌ హిట్‌ చిత్రం ‘మిస్‌గ్రానీ’ తెలుగులో ‘ఓ బేబీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సురేష్‌ బాబు నిర్మించారు. ఓ సరికొత్త సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద చక్కటి వసూళ్లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ సినిమాను బాలీవుడ్‌కు తీసుకెళ్లేందుకు సన్నాహలు చేస్తున్నారట నిర్మాత సురేష్‌బాబు. హిందీ రీమేక్‌ను కూడా ఆయనే స్వయంగా నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ చిత్రంలో సమంత పోషించిన పాత్రను బాలీవుడ్‌లో ఆలియా భట్‌ చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడీ అమ్మడు చేతిలో ఉన్న ప్రాజెక్టుల జాబితాను చూస్తుంటే.. ఈ రీమేక్‌ ఇప్పట్లో సాధ్యమేనా అన్న అనుమాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆలియా ‘బ్రహ్మాస్త్ర’, ‘తఖ్త్‌’, ‘సడక్‌ 2’ వంటి క్రేజీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇదే సమయంలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల ముందుకూ రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఓబేబీ’ హిందీ రీమేక్‌కు ఆమె ఓకే చెప్పినా.. సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి వచ్చే ఏడాది వరకు వేచి చూడక తప్పదు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.