‘బ్రహ్మాస్త్ర’.. బాలీవుడ్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం. అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, అక్కినేని నాగార్జున, అలియా భట్ ప్రధాన తారాగణంగా రూపొందుతుంది. మరి ఇలాంటి సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవు కదా. ముఖ్యంగా నిర్మాణ వ్యయం మీదే అందరి దృష్టి ఉంటుంది. ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎన్ని కోట్లు? అనే ప్రశ్నలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ఇటీవలే ఈ సందేహాలు సమాధానం ఇచ్చారు స్టార్ అండ్ డిస్నీ ఇండియా ఛైర్మన్ ఉదయ్ శంకర్. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2020 కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వివరాలు తెలిపారు. ‘బ్రహ్మాస్త్ర’ రూ.300 కోట్ల బడ్జెట్ను దాటేసిందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా...‘ దానికంటే ఎక్కువే’ అని జవాబిచ్చారు.ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో శంకర్ ‘2.0’, రాజమౌళి ‘బాహుబలి2’, ప్రభాస్ ‘సాహో’ సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ వీటిని మించిపోనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో రవీనా టండన్, మౌనిరాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.