బెల్లంకొండ పాత్రలో ఆయుష్మాన్‌ ఖురానా!!

ఆయుష్మాన్‌ ఖురానా ఓ తెలుగు హిట్‌ చిత్రాన్ని హిందీలో రీమేక్‌లో చేయబోతున్నారా? యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ పోషించిన పాత్రను పోషించబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇంతకీ ఆ తెలుగు హిట్‌ మరేదో కాదు.. ఇటీవలే బెల్లంకొండకు చక్కటి విజయాన్ని అందించిన ‘రాక్షసుడు’. తమిళ్‌లో విజయవంతమైన ‘రాక్షసన్‌’కు తెలుగు రీమేక్‌గా రమేష్‌ వర్మ దీన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైకో థ్రిల్లర్‌కు తెలుగులోనూ మంచి ఆదరణతో పాటు చక్కటి వసూళ్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్‌లో పునర్నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్నాహాలు మొదలుపెట్టిందట. అంతేకాదు కథానాయకుడిగా ఆయుష్మాన్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తోందట. వైవిధ్యభరిత చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే ఈ యువ హీరో ఈ కథకు పక్కా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర రీమేక్‌ విషయమై ఆయుష్‌తో నిర్మాతలు సంప్రదింపులు షురూ చేశారట. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానున్నట్లు బాలీవుడ్‌ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.