ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘భారత్‌’ ట్రైలర్‌

ల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భారత్‌’. కత్రినా కైఫ్‌ కథానాయిక. దిశా పటానీ, టబు, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సల్మాన్‌తో ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ దీనికి దర్శకుడు. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌తో అవి మరింత పెరిగాయి. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి 70 ఏళ్ల వరకూ దేశంతో పాటే ఎదుగుతూ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లాంటి ఎన్నో ఆటుపోట్లను దాటుకుంటూ ఓ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన భారత్‌ అనే వ్యక్తి కథను ఈ ట్రైలర్‌లో స్పృశించారు. సల్మాన్‌ కుర్ర వయసు నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధుడి వరకూ ఐదు రకాల గెటప్పుల్లో కనిపించి అలరిస్తున్నారు. సర్కస్‌ కళాకారుడిగా సల్మాన్‌ బైక్‌పై చేసిన సాహసోపేతమైన స్టంట్లు ఆకట్టుకుంటున్నాయి. కత్రినా కైఫ్, దిశా పటానీలతో సల్మాన్‌ రొమాన్స్‌ కనువిందు చేస్తోంది. కత్రినాకు, సల్మాన్‌కు మధ్య సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. ప్రియురాలు, స్నేహితులు, కుటుంబం ఇలా అన్ని అనుబంధాలతో ఆనందకరంగా కనిపించే భారత్‌ జీవితంలో ఓ కనిపించని విషాదముంటుంది. బాల్యంలో తండ్రికిచ్చిన మాటే ఇప్పటికీ బతికిస్తుంటుంది. ఏంటా విషాదం? ఇంతకీ తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా లేదా అన్నది సినిమాపై ఆసక్తి రేపుతోంది. ‘ప్రతి చిరునవ్వు ఎవ్వరూ చూడలేని ఓ బాధను దాస్తుంటుంది’, ‘దేశాలు ప్రజల చేత నిర్మించబడతాయి. ప్రజలు వారి కుటుంబాలతో గుర్తుంటారు. కానీ ఈ దేశమే నీ కుటుంబం’ లాంటి సంభాషణలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈద్‌ కానుకగా జూన్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.

                           


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.