‘చుప్కే చుప్కే’ మళ్లీ వస్తోంది

బాలీవుడ్‌లో నిన్నటి తరాన్ని అలరించిన చిత్రాలను ఈతరం వారికి చూపించేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ‘కూలీ నెం.1’, ‘పతి పత్ని ఔర్‌ వో’ చిత్రాల రీమేక్‌లు సెట్స్‌ మీదున్నాయి. ఇప్పుడు మరో రీమేక్‌కు రంగం సిద్ధమవుతోంది. అదే ‘చుప్కే చుప్కే’. అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర, జయా బచ్చన్, షర్మిలా ఠాగూర్‌ ప్రధాన పాత్రల్లో హృషికేష్‌ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రమిది. 1975లో విడుదలైన ఈ హాస్య ప్రధాన చిత్రం ఘన విజయం సాధించింది. డాక్టర్‌ పరిమల్‌ త్రిపాఠి అనే ప్రొఫెసర్‌ పాత్రలో ధర్మేంద్ర పండించిన వినోదం ఇప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడీ చిత్రాన్ని టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ రీమేక్‌ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ‘చుప్కే చుప్కే’ పేరుతోనే తెరకెక్కించనున్నారు. ధర్మేంద్ర చేసిన పాత్ర కోసం రాజ్‌కుమార్‌ రావ్‌ను ఎంచుకున్నారు. మిగిలిన ప్రధాన పాత్రల్లో ఎవరు నటించనున్నారన్నది తెలియాల్సి ఉంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.