ట్రైలర్‌తో వచ్చేసిన హిందీ ‘అర్జున్‌రెడ్డి’

తెలుగు వెండితెర సంచలనం ‘అర్జున్‌ రెడ్డి’ని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాతృకను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో దేవరకొండ పోషించిన పాత్రను హిందీలో షాహిద్‌ కపూర్‌ చేయగా.. షాలిని పాండే పాత్రలో కియారా అడ్వాణి కనిపించబోతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. దీన్ని చూస్తుంటే ఒరిజినల్‌ కథను ఏమాత్రం చెడగొట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా హిందీలోనూ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. డాక్టర్‌ కబీర్‌ తన ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి ఓ అమ్మాయికి సంబంధించిన వివరాలు అడగడం మొదలు.. చివర్లో ఫుల్‌గా డ్రగ్స్‌ తీసుకోని అతను స్పృహ లేకుండా నేలపై పడిపోయే ఉండే సీన్‌ వరకు ప్రతిదీ ‘అర్జున్‌ రెడ్డి’ని గుర్తుచేస్తూనే సాగింది. ముఖ్యంగా కథలోని ఫీల్‌ అద్భుతంగా క్యారీ చేశారు. ఇక ట్రైలర్‌లో కనిపించిన కల్ట్‌ సన్నివేశాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. షాహిద్‌ - కియారా మధ్య వచ్చే ముద్దు సన్నివేశాలు చూస్తుంటే దేవరకొండ - షాలినిలే కళ్ల ముందు మెదులుతారు. వయసు పరంగా దేవరకొండ కన్నా షాహిద్‌ వయసు ఎక్కువైనప్పటికీ.. పాత్రపై ఆ ప్రభావం ఎక్కడా పడనీయలేదు. భగ్నప్రేమికుడిగా.. కాలేజి యువకుడిగా రెండు పాత్రల్లో చక్కటి వేరియషన్స్‌ చూపించాడు. కియారా ప్రీతి పాత్రలో లీనమై నటించింది. ట్రైలర్‌లో వినిపించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ని సైతం ఎక్కడా చెడగొట్టకుండా యథాతథంగా తీసుకొన్నారు. మొత్తానికి ఇది తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథే అయినా ట్రైలర్‌ చూస్తుంటే ఓ ఫ్రెష్‌ చిత్రాన్ని చూసిన అనుభూతే కలుగుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.