సెట్స్‌పైకి హిందీ ‘జెర్సీ’.. విడుదలయ్యేది ఆరోజే!!

ఇటీవల కాలంలో తెలుగు సినీప్రియుల్ని మురిపించిన వైవిధ్యభరిత కథా చిత్రాల్లో ‘జెర్సీ’ ముందు వరసలో నిలబడుతుంది. వెలుగులోకి రాని అనేక మంది సచిన్‌ల జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకోని యువ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్నీ దక్కించుకొంది. గతంలో ఏ దర్శకుడు తెరకెక్కించని విధంగా ఈ స్పోర్ట్స్‌ డ్రామాను గౌతమ్‌ తీర్చిదిద్దిన విధానం, అర్జున్‌ అనే క్రికెటర్‌గా నాని కనబర్చిన నటన ప్రతిఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ హిట్‌ చిత్రంపై బాలీవుడ్‌కు తీసుకుపోతున్నారు తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌రాజు. వీరితో పాటు మరో బాలీవుడ్‌ నిర్మాత అమన్‌ గిల్‌ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన వెలువడినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్స్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘జెర్సీ’ హిందీ వెర్షన్‌ని కూడా మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరే తెరకెక్కిస్తారట. అంతేకాదు ఇందులో నాని పోషించిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్‌ చేయబోతున్నారట. త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రాన్ని 2020 ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. షాహిద్ ఇటీవలే ‘కబీర్‌ సింగ్‌’తో ఓ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇది తెలుగు హిట్‌ మూవీ ‘అర్జున్‌రెడ్డి’కి హిందీ రీమేక్‌. ఇప్పుడు మళ్లీ ఓ హిట్‌ తెలుగు రీమేక్‌తోనే బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుండటం విశేషం. మరోవైపు ఈ చిత్రంతో ఒకేసారి అటు దర్శకుడు గౌతమ్‌ ఇటు దిల్‌రాజు, అల్లు అరవింద్‌ వంటి టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్లు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.