కరోనా ఎఫెక్ట్‌: ఆగిన ‘జెర్సీ’ రీమేక్‌

నాని కథానాయకుడిగా నటించిన హిట్‌ చిత్రం ‘జెర్సీ’.. ఇప్పుడు హిందీలో రీమేక్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరే ఈ రీమేక్‌ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. అల్లు అరవింద్, దిల్‌రాజు, అమన్‌ గిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చండీగఢ్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ, తాజాగా ఈ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు షాహిద్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చిత్ర బృందం, వాళ్ల కుటుంబాల క్షేమం కోరి చిత్రీకరణను తాత్కాలికంగా ఆపేసినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే మనమెంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకే ముందు జాగ్రత్తగా తమ చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. సురక్షితంగా ఉండాలి అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు షాహిద్‌. అయితే ఈ చిత్రీకరణ నిలుపుదల ఎప్పటి వరకన్నది క్లారిటీ ఇవ్వలేదు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.