ఇద్దరు హీరోలతో బాలీవుడ్‌ ‘ఖైదీ’!!

రొమాన్స్‌ చెయ్యడానికి ప్రేయసి కనిపించదు.. ప్రేక్షకుల కోసమైనా ఓ ఐటెం గీతాన్ని ఇరికించి పెట్టే సాహసం చేయలేదు.. కేవలం క్లైమాక్స్‌లో తప్ప పట్ట పగటి పూట ఒక్కటంటే ఒక్క షాటు కనిపించదు. తెరపై కనిపించేదంతా ఓ భావోద్వేగ ప్రయాణమే. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే యాక్షన్‌ హంగామానే. ఇదంతా కార్తి చేసిన ‘ఖైదీ’ చిత్రం గురించే. గతేడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి ఘన విజయాన్ని అందుకొంది. అద్భుతమైన కథ కథనాలతో దర్శకుడు లోకేష్‌ కనగరాజన్‌ చూపించిన మాయాజాలానికి ప్రతిఒక్కరూ ముగ్దులైపోయారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ క్రేజీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం రాజ్‌కుమార్‌ను దర్శకుడిగా తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పుడీ చిత్ర కథానాయకుడి పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఈ కథలో ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొన్ని కీలక మార్పులు చేశారట. దీని వల్ల ఇదొక మినీ మల్టీస్టారర్‌ కథలా మారుతోందని సమాచారం. ఇప్పుడీ చిత్రం కోసం హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ల పేర్లు పరిశీలిస్తున్నారట. అయితే వీళ్లలో కార్తి పాత్రను ఎవరు పోషిస్తారనేది ఇంకా తెలియరాలేదు. బాలీవుడ్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం హృతిక్‌ ఖైదీగా కనిపిస్తాడని, రణ్‌వీర్‌ పోలీస్‌ అధికారిగా దర్శనమివ్వబోతున్నాడని తెలుస్తుంది. మరి ఈ వీటిలో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.