లడఖ్‌లో షూటింగ్‌ని రద్దు చేసుకొన్న లాల్‌ సింగ్‌ చద్దా


ఇండియా - చైనాల మధ్య గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణ కారణంగా మనదేశానికి సంబంధించి 20మంది సైనికలు అమరులయ్యారు. అందులో తెలుగువాడైన కల్నల్ సంతోష్‌బాబు కూడా ఉన్నారు. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే చిత్రం చేస్తున్నాడు.  సినిమా షూటింగ్‌ లఖడ్‌లో ఈ ఏడాది అక్టోబర్లో షూటింగ్‌ జరుపుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం  ఇండియా - చైనా మధ్య గాల్వన్‌ లోయలో ఘర్షణ కారణంగా చిత్ర షూటింగ్‌ని రద్దు చేసుకుంటున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అమీర్‌ఖాన్‌, కరీనా కపూర్‌, విజయ్‌ సేతుపతి, మోనా సింగ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే కోల్‌కత్తా, ధిల్లీ, రాజస్థాన్‌, అమృతసర్‌, చంఢీఘర్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం కోవిడ్‌-19 కారణంగా అమీర్‌ఖాన్‌ సిబ్బందికి కూడా పాజిటీవ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్‌ని రద్దు చేసుకొంటేనే మేలు జరుగుతుందని భావిస్తున్నారట. చిత్ర షూటింగ్‌ని లడఖ్‌లో కాకుండా కార్గిల్‌లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే కార్గిల్‌ ప్రాంతంలో షూటింగ్‌ జరపాలా వద్దా అనేది ఇంకా చర్చలు జరుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనిషి ప్రాణాల కంటే ఏదీ విలువైనది కాదని కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రస్తుతం చాలా తీవ్రస్థాయిలో ఉందని అందువల్ల షూటింగ్‌ తిరిగి ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై కూడా చర్చలు సాగుతున్నాయట. అమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్, వయాకామ్‌18 మోషన్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా వైరస్‌ లేకుంటే ఈ ఏడాది క్రిస్మస్‌ పండుగ నాటికి చిత్రం తెరపైకి వచ్చేది. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.