సింధు జోరు ఆగట్లే.. బయోపిక్‌ ఎంతకీ తెగట్లే!!

పూసర్ల వెంకట సింధు.. ప్రస్తుతం ఈపేరు భారత్‌లోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ మారుమోగుతుందంటే అతిశయోక్తి కాదు. బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత కీర్తిని శిఖర స్థాయికి చేర్చిన కీర్తి ఆమె సొంతం. అతి తక్కువ వయసులోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఒక ఒలింపిక్‌ పతకంతో పాటు ఐదు ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పతకాలు సొంతం చేసుకోని ఓ చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో సాధించిన బంగారు పతకమైతే మరింత ప్రత్యేకం. అయితే ఓవైపు సింధు తన కీర్తిని అంతకంతకూ పెంచుకుంటూ పోతుంటే ఆమె జీవితాధారంగా తెరకెక్కించాలనుకున్న బయోపిక్‌ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. అయితే దీనంతటికీ కారణం కూడా ఓ రకంగా ఆమె సాధిస్తున్న విజయాలే అని చెప్పొచ్చు. 2016లో రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సాధించాక ఆమె జీవితకథను వెండితెరపైకి తీసుకురావాలనుకున్నారు నటుడు సోనూసూద్‌. గత మూడేళ్లుగా దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతూనే ఉంది. కానీ, ఇంతవరకు చిత్ర క్లైమాక్స్‌ ఎంతకీ తెగడం లేదు. ఎందుకంటే సింధు పతక దాహం రియోతో ఆగిపోలేదు. గత రెండేళ్లలో ఆమె ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రెండు రజతాలతో పాటు తాజాగా స్వర్ణాన్ని అందుకొంది. వాస్తవానికి సోనూసూద్‌ ఈ చిత్రాన్ని అనుకున్నప్పుడు ఆమె కథను రియోలో రజతం సాధించడంతోనే ముగించాలనుకున్నారు. కానీ, ఇప్పుడు సాధించిన ఘనతలన్నింటినీ పక్కకు పెట్టి ఆమె కథను రియోతోనే ముగిస్తే అసంపూర్తిగా ఉంటుంది. కాబట్టి ఆమె తాజా కెరీర్‌ వరకు కథను పొడిగించుకోక తప్పదు. అయితే వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ కూడా రాబోతున్న తరుణంలో ఆమె జీవితకథను ఇక్కడితోనే ముగించే సాహసం చేసినా ఇబ్బందే. ఎందుకంటే ప్రస్తుతం సింధు ఊపు చూస్తుంటే రాబోయే ఒలింపిక్స్‌లో ఆమె స్వర్ణం కొల్లగొట్టడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. కాబట్టి కొంచెం ఆలస్యమైనా సోనూ అంత దాకా వేచి చూస్తే మరింత మంచిది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.