సల్మాన్‌పైకి పూరి గురి


న సినిమాలను ఎంత వేగంగా పూర్తి చెయ్యగలరో.. అంతకంటే వేగంగా తన కథల్నీ సిద్ధం చేసుకోగలరు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఇప్పుడీ స్పీడ్‌తోనే ఈ లాక్‌డౌన్‌ విరామంలో రెండు స్ర్కిప్ట్‌లను పూర్తి చేశారు పూరి. వీటిలో ఒకటి పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న చిత్రమని ఇప్పటికే ప్రకటించారు కూడా. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పూరి సిద్ధం చేసుకున్న ఈ పాన్‌ ఇండియా కథ.. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కోసమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయమై ఆయనతో సంప్రదింపుల ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయనకు నిర్మాత కరణ్‌ జోహార్‌ సహాయ సహకారాలు అందిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరి కలయికలోనే ‘ఫైటర్‌’ ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇప్పటికే 40శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది పూర్తయిన వెంటనే ఈ కొత్త పాన్‌ ఇండియా చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంటుంది. మరి నిజంగా ఈ కథ సల్మాన్‌ కోసమేనా? లేక మరో బాలీవుడ్‌ హీరోతో తెరకెక్కిస్తారా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.