మరోసారి రణ్‌వీర్‌- రోహిత్‌ కాంబినేషన్‌

రణ్‌వీర్‌ సింగ్, రోహిత్‌ శెట్టిల కలయికకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆ మధ్య వీళ్లిద్దరి నుంచి వచ్చిన ‘సింబా’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చక్కటి విజయాన్ని అందుకోవడంతో పాటు దాదాపు రూ.240కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం రోహిత్‌ నుంచి రాబోతున్న మరో పోలీస్‌ చిత్రం ‘సూర్యవంశీ’లోనూ అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారు రణ్‌వీర్‌ సింగ్‌. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే రోహిత్‌ దర్శకత్వంలోనే మరో సినిమా చేయబోతున్నారు రణ్‌వీర్‌. ఇంతకీ ఆ చిత్రం మరేదో కాదు.. ‘గోల్‌మాల్‌ 5’. దర్శకుడిగా రోహిత్‌కు మంచి గుర్తింపు తెచ్చిన ‘గోల్‌మాల్‌’ సిరీస్‌ నుంచి రానున్న ఐదోచిత్రమిది. అజయ్‌ దేవగణ్‌ ఓ కథానాయకుడిగా నటించబోతున్నారు. ఇప్పుడీ వినోదాత్మక చిత్రంలో రణ్‌వీర్‌ కూడా భాగం కానున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయని, లాక్‌డౌన్‌లోనే రణ్‌వీర్‌కు కథ వినిపించగా ఆయన సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబరులో ప్రారంభించి వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్రణాళిక రచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.