ఆసక్తికరంగా ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ టీజర్‌

‘‘వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు’’.. అంటున్నారు తాప్సి, భూమి పెడ్నేకర్‌. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘సాండ్‌ కీ ఆంఖ్‌’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు చూసిన బయోపిక్‌లలో ఇదొక భిన్నమైన నేపథ్యంతో వస్తోన్న చిత్రమిది. ఇందులో తాప్సి, భూమి 60 ఏళ్ల వయసున్న సాహసోపేతమైన మహిళలుగా కనిపించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రూ తోమర్, ప్రకాశీ తోమర్‌ అనే తోడికోడళ్ల జీవితాధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. వీరికి ‘షూటర్‌ దాదీస్‌’ అనే పేరుంది. యూపీలోని జోహ్రి అనే గ్రామానికి చెందిన చంద్రో తోమర్‌, ప్రకాశీ తోమర్‌ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండేవారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడంతో కుటుంబం కోసమే తమ జీవితాన్ని వెచ్చించారు. తమలా తమ కుమార్తెల జీవితాలు కాకూడదని భావించి 50 ఏళ్ల వయసులో తుపాకీ చేతపడతారు. వారి చదువులను అడ్డుకోవాలని చూసేవాళ్లని తుపాకీలతో బెదిరించేవారు. ఈ నేపథ్యంలో తుపాకీతో టార్గెట్‌ మిస్సవకుండా దేన్నైనా కొట్టగలిగే సామర్ధ్యం తమలో ఉందని వారికి తెలుస్తుంది. అలా వారు జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరూ దాదాపు 300లకు పైగా పతకాలు సాధించారు. ఇప్పుడు వీరిద్దరి స్ఫూర్తిగాథనే వెండితెరపై చూడబోతున్నాం. ఈ బయోపిక్‌లో నటించే ముందు చంద్రూ, ప్రకాశీల గురించి తెలుసుకోవడానికి వారి స్వస్థలమైన బాగ్‌పట్‌ జిల్లాకు వెళ్లి, కొన్ని రోజులు వారి ఇంట్లోనే ఉన్నారు తాప్సీ, భూమి. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం కూడా ఆ ప్రాంతంలోనే జరిగింది. ఈ చిత్రానికి తుషార్‌ హీరానందని దర్శకత్వం వహిస్తుండగా.. అనురాగ్‌ కశ్యప్‌ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల్ని పలకరించనుంది ఈ బయోపిక్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.