‘లక్ష్మీబాంబ్‌’కు సల్మాన్‌ ‘కిక్‌ 2’ స్ట్రోక్‌!!

ల్మాన్‌ ఖాన్‌కు ఈద్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌లో పేరుంది. ఎందుకంటే ప్రతి రంజాన్‌కు ఆయన తన కొత్త చిత్రంతో పలకరిస్తూనే ఉంటారు. ఈ ఏడాది ఈద్‌కు ‘భారత్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన.. వచ్చే ఏడాదికి ‘ఇన్షాల్లా’తో కానుక ఇవ్వాలనుకున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ చిత్రం అనుకోకుండా ఆగిపోవడంతో వచ్చే రంజాన్‌కు బాక్సాఫీస్‌ వద్ద సల్లూ భాయ్‌ని చూడటం కష్టమే అనుకున్నారు. కానీ, తాజాగా ఆయన ‘ఇన్షాల్లా’ బదులు ‘కిక్‌ 2’ రూపంలో మరో సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఈద్‌ కానుకగా విడుదల చేయనున్నారట. సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మించబోయే ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌ కనిపించనుందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయని, ‘దబాంగ్‌ 3’ చిత్రీకరణ ముగియగానే సల్మాన్‌ ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం. దీన్ని రవితేజ హిట్‌ మూవీ ‘కిక్‌ 2’కు రీమేక్‌గా తెరకెక్కించనున్నారు. అయితే ఇప్పుడు సల్లూ భాయ్‌ రంజాన్‌ రేసులో దిగడం అక్షయ్‌ ‘లక్ష్మీబాంబ్‌’కు ఆ సెగ తగిలేటట్లే కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాను ఈద్‌కు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందింది. ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే ఈద్‌కు అక్షయ్‌ - సల్మాన్‌ బాక్సాఫీస్‌ ముందు పోరుకు దిగక తప్పదు. ఏదేమైనా సోలోగా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేద్దామనుకున్న అక్షయ్‌ ఆశలకు ‘కిక్‌ 2’ రూపంలో గట్టి స్ట్రోక్‌ తగిలిందే అని చెప్పొచ్చు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.