సింధు పాత్రకు సామ్‌ సరిపోతుందా?

బ్యాడ్మింటన్‌లో అసాధారణ రీతిలో వరుస పతకాలు కొల్లగొడుతూ ప్రపంచ దేశాల ముందు భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తోంది పీవీ సింధు. ఇటీవలే ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలిచి మరోసారి మన దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది. ప్రస్తుతం ఈమె స్ఫూర్తిదాయక జీవితకథను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. అయితే ఈ సినిమాలో టైటిల్‌ పాత్ర ఎవరు చేయబోతున్నారన్నది ఇప్పటికైతే ఖరారు కాలేదు. తొలుత ఈ పాత్ర కోసం ఎవరైనా బాలీవుడ్‌ అగ్ర నాయికను తీసుకోవాలని భావించినప్పటికీ ఇప్పుడీ పాత్రకు సమంతను ఎంపిక చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయమై సామ్‌తో చర్చలు జరుపుతోందట చిత్ర బృందం. అయితే ఈ వార్తలు ఎంతవరకు వాస్తవమన్నది పక్కకు పెడితే అసలు సింధు పాత్రకు సామ్‌ సరిపోతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పీవీ సింధు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె పొడవాటి రూపమే. కానీ, సామ్‌ విషయానికొస్తే సింధుతో పోల్చితే చాలా పొడవు తక్కువే అని చెప్పాలి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో సామ్‌ ఎంపిక చిత్ర బృందాన్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశముంది. దీనికి తోడు ఈ బయోపిక్‌ను బాలీవుడ్‌లోనూ విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి మార్కెట్‌ లేని సామ్‌ను సింధు పాత్రకు తీసుకోవడం ఓ రిస్క్‌ అనే చెప్పొచ్చు. అదే దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌ వంటి వారిని తీసుకొస్తే అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదిలోనూ బయోపిక్‌పై మంచి అంచనాలు ఏర్పడే అవకాశముంటుంది. అయితే సామ్‌ ఎత్తు, ఆమె మార్కెట్‌ విషయాలను పక్కకు పెట్టి చూస్తే మిగతా అన్ని విషయాల్లో సింధు పాత్రకు ప్రాణం పోయగల సత్తా సమంతకు ఉంది. ముఖ్యంగా ఈ పాత్రను చేయడానికి కావాల్సిన ఫిట్‌నెస్‌ సామ్‌ సొంతం. ఇక రూపు విషయంలోనూ.. సామ్‌కు సింధుకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కాబట్టి సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ అయ్యే అవకాశముంది. ఇంతకీ ఇవన్నీ పక్కకు పెడితే ముందు ఈ బయోపిక్‌కు సామ్‌ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. త్వరలనే ఈ ప్రాజెక్టుపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.