ఇప్పుడు కనిపించే సారా వెనుక అంత కష్టముంది!

బాలీవుడ్‌ తెరపై అడుగుపెడుతూనే ‘కేదార్‌ నాథ్‌’, ‘సింబా’ వంటి బ్లాక్‌బస్టర్లను ఖాతాలో వేసుకోని అందరి దృష్టినీ ఆకర్షించింది సారా అలీ ఖాన్‌. సైఫ్‌ అలీ ఖాన్‌ నట వారసురాలిగా వెండితెరపై మెరిసిన ఈ అందాల తారక సొగసులకు, ఆమె అభినయానికి ఫిదా అవ్వని సినీప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. పికాసో కుంచె నుంచి జాలువారిందా అన్నట్లుండే ఆ రూపం.. జక్కన్న చెక్కిన శిల్పమా అన్నట్లుండే ఆ ఒంపుసొంపులు కుర్రకారు గుండెల్లో ప్రేమగంటలు మోగిస్తాయి. అయితే మనం ఇప్పుడు చూస్తున్న సారా సొగసుల వెనుక ఎంతో క్రమశిక్షణతో కూడా కష్టం.. ఓర్పు ఉన్నాయట. పీసీఓడీ (పొలిసైటిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)తో బాధపడటం వల్ల కొన్నాళ్ల క్రితం వరకు ఆమె ఓ డ్రమ్ములా ఉండేదట. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. అయితే దీని నుంచి బయటపడటానికి సారా ఎంతో కఠినమైన ఆహార నియమాలను, కసరత్తులను చేసిందట. తాజాగా ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. అమెరికాలో డిగ్రీ చివరి సంవత్సరం చేస్తున్నప్పటి నుంచి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిందట ఆమె. ‘‘మొదటి నుంచి నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. కానీ, అధిక బరువు వల్ల ఎవరైనా నన్నేమైనా ఎగతాలి చేస్తారేమోనని భయపడుతుండేదాన్ని. అందుకే ఎలాగైనా బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నా. ఇందులో భాగంగా ముందు నేను తినే ఆహారంలో చాలా మార్పులు చేసుకున్నా. పిజ్జా బదులు ప్రొటీన్‌ షేక్, చాక్లెట్ల బదులు సల్లాడ్లు తీసుకునేదాన్ని. దీంతో పాటు ఎంతో క్రమశిక్షణగా అత్యంత కఠినమైన కసరత్తులు చేసేదాన్ని. అలా క్రమంగా పీసీఓడీ నుంచి బయటపడి నేననుకున్న రూపాన్ని సాధించుకోగలిగా’’అని వెల్లడించింది. మొత్తానికి తాను వారసత్వ నీడ నుంచే తెరపైకి వచ్చినా.. స్టార్‌ నాయికగా మారడానికి తానెంత కష్టపడుతోందన్నది తొలి అడుగుల్లోనే చూపించేసింది సారా.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.