ముందు సినిమా చూడండి.. తర్వాతే నిర్ణయం తెలపండి

‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌ను ముందు కేంద్ర ఎన్నికల సంఘం వీక్షించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. భారత ప్రధాని మోదీ జీవిత కథతో తెరకెక్కిన చిత్రమిది. టైటిల్‌ పాత్రను వివేక్‌ ఒబెరాయ్‌ పోషించారు. ఒమంగ్‌ కుమార్‌ దీనికి దర్శకత్వం వహించారు. ఎన్నికల ముందు ఎలాంటి రాజకీయ బయోపిక్‌లను ప్రదర్శించవద్దని ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్ర బృందం సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేయగా.. దీన్ని విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు సోమవారం తన తీర్పును వెలువరించింది. ఈసీ ముందు ‘మోదీ’ బయోపిక్‌ను వీక్షించాల్సిందిగా ఆదేశించింది. ఆ తర్వాతే సినిమా విడుదల చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందా? లేదా? అన్నది నిర్ణయించాలని పేర్కొంది. సినిమా చూసి ఏప్రిల్‌ 22లోగా తమ అభిప్రాయాన్ని సీల్డ్‌ కవర్‌లో న్యాయస్థానానికి అందజేయాల్సిందిగా తీర్పు చెప్పింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.