హిందీలో ‘జెర్సీ’లో.. షాహిద్‌ తండ్రి సైతం..

తెలుగు ‘అర్జున్‌రెడ్డి’.. ‘కబీర్‌ సింగ్‌’ రూపంలో షాహిద్‌ కపూర్‌కు ఆయన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఉత్సాహంలోనే ఆయన మరో తెలుగు రీమేక్‌కి పచ్చజెండా ఊపారు. నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ని ఇప్పుడు హిందీలో చేయబోతున్నారు షాహిద్‌. మాతృకను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ వెర్షన్‌కూ దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో ప్రస్తుతం క్రికెట్‌ ఆటలో శిక్షణ తీసుకుంటున్నారు షాహిద్‌. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రంలో షాహిద్‌కు క్రికెట్‌ గురువుగా ఆయన తండ్రి పంకజ్‌ కపూర్‌నే తీసుకోబోతుందట చిత్ర బృందం. ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఇప్పుడు పంకజ్‌ చేయబోయే పాత్రను తెలుగు సత్యరాజ్‌ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్‌ చివరిసారిగా తన తండ్రితో కలిసి నాలుగేళ్ల క్రితం ‘షాందార్‌’లో నటించారు. ఇందులో ఆలియా భట్‌కు తండ్రిగా పంకజ్‌ కనిపించారు. మళ్లీ ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ తండ్రీకొడుకులిద్దరూ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతుండటంతో ఈ చిత్రంపై సినీప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.