తెలుగు దర్శకులతో షారుఖ్‌ కొత్త చిత్రం!!

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ కొత్త చిత్ర ప్రకటన కోసం సినీప్రియుల ఎదురు చూపులు కొనసాగుతునే ఉన్నాయి. ‘జీరో’ ఫలితం దెబ్బకు షారుఖ్‌ పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోవడంతో స్క్రిప్ట్‌ల ఎంపిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్‌కుమార్‌ హిరాణీతో ఓ కొరియన్‌ చిత్రాన్ని రీమేక్‌ చేస్తారని, యువ దర్శకుడు అట్లీతో చెయ్యడానికి రెడీ అయ్యారని ఆ మధ్య వార్తలొచ్చినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. కానీ, తాజాగా బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ప్రముఖ తెలుగు దర్శకులతో షారుఖ్‌ ఓ సినిమా చెయ్యడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ దర్శకులు మరెవరో కాదు.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌తో సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన కృష్ణ డికే, రాజ్‌ నిడమోరు. ప్రస్తుతం ఈ ఇద్దరి నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మార్చి నుంచి అమెజాన్‌లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు బాలీవుడ్‌ బాద్షా కోసం ఓ ఆసక్తికర యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశాన్ని సిద్ధం చేశారట. ఇటీవలే ఈ స్క్రిప్ట్‌ను షారుఖ్‌కు వినిపించగా ఆయనెంతో ఎగ్జైట్‌ అయ్యారని, త్వరలోనే దీన్ని పట్టాలెక్కించడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసేందుకు కింగ్‌ ఖాన్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.