దీపావళి నాటికి ఆ రెండు చిత్రాల మధ్య యుద్ధం తప్పదా?

ప్రస్తుతం సినిమా థియేటర్లలో ఎటుచూసినా అంతా శూన్యమే కనిపిస్తుంది. కారణం కరోనా వైరస్‌ అని చెప్పవచ్చు. అయితే లాక్‌డౌన్‌ పూర్తికాగానే ప్రభుత్వంతో చర్చలు జరుపుతారట. జూలై చివరి వారం నాటికి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అక్కడ కూడా సామాజిక దూరంతోనే ప్రేక్షకులు కూర్చోవలసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. 500 మంది పట్టే థియేటర్లో కేవలం యాభై శాతం మాత్రమే అనుమతి ఇస్తారనే ఉహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే బాలీవుడ్‌ అగ్రహీరోల సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోగా, మరికొన్ని ఓటీటీల ద్వారా కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’తో పాటు మరో హీరో అక్షయ్‌ కుమార్‌ పోలీస్‌ అధికారికగా నటిస్తున్న చిత్రం ‘సూర్యవన్షీ’. అంతా సవ్యంగా జరిగితే ఈపాటికే ఈ చిత్రాలు అభిమానులను అలరించేవి. అయితే తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించి దీపావళి పండుగ నాటికి నేరుగా థియేటర్లోనే విడుదల చేయడానికి చిత్రనిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అయితే ఈ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని బాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన కథానాయికగా దిశా పటానీ నటిస్తోంది. యాక్షన్‌ చిత్రాల దర్శకుడు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న ‘సూర్యవన్షీ’లో కత్రీనా కైఫ్‌ డాక్టర్‌ అదితి సూర్యవన్షీగా నటిస్తోంది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.