2021లోనే బాక్సాఫీసు ముందుకు..


కరోనా మొత్తం తలకిందులు చేసేసింది. ఈ ఏడాది చిత్ర పరిశ్రమ ఆశలను ఆవిరి చేసేసింది. దాదాపు ఈ ఏడాది సినిమాల్ని థియేటర్లో విడుదల చేయడం వీలయ్యే పని కాదని ఎక్కువ శాతం పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నిరాశే మిగలడంతో బాలీవుడ్‌లో పెద్ద చిత్రాలు వచ్చే ఏడాదిపై గురి పెట్టాయి. విడుదల తేదీల్ని ప్రకటిస్తూ ముందుగానే కర్చీఫ్‌ వేసేస్తున్నాయి.

2020 ఎంతో ఆనందంగా మొదలైనా కరోనా రాకతో తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఏడాదిలో ఇక నాలుగు నెలల సమయమే ఉంది. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది బాలీవుడ్‌ నుంచి ‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాలు దీపావళి, క్రిస్మస్‌ కానుకలుగా రానున్నాయి. ఇక మరే చిత్రాలు వచ్చే అవకాశమే లేదు. అందుకే ముందుగానే 2021 కోసం తమ సినిమాల విడుదల తేదీల్ని ప్రకటిస్తూ తమ చిత్రాల్ని సిద్ధం చేస్తున్నాయి. అక్షయ్‌కుమార్‌ ‘బెల్‌బాటమ్‌’తో బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద భారీ చిత్రాల సందడి మొదలుకానుంది. ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్‌ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అజయ్‌దేవగణ్‌ ‘మైదాన్‌’ను అదే ఏడాది ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. ఇందులో అజయ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ ‘రాధే: ది మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ను ఈద్‌ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి ప్రభుదేవా దర్శకుడు. అమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ను 2021 క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అక్షయ్‌కుమార్‌ వచ్చే ఏడాది రానున్న మరో చిత్రం ‘రక్షా బంధన్‌’. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇవి కాకుండా కొత్తగా ప్రకటించినవి, కొంతమేరే చిత్రీకరణ పూర్తయినవి, విడుదల తేదీ విషయంలో స్పష్టత రాని చిత్రాలు మరిన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల్ని అలరించనున్నాయి.


వెండితెరపై చూస్తేనే బాగు

‘‘ఈ ఏడాదిలో మిగిలింది నాలుగు నెలలే. ఇప్పటికే పూర్తయినవి మినహా మిగిలిన భారీ బడ్జెట్‌ చిత్రాలు ఇప్పుడు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అవన్నీ ఇంకా ఎంతోకొంత చిత్రీకరణ చేసుకోవాల్సి ఉంది. అందుకే 2021లో వస్తాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి మరిన్ని చిత్రాల విడుదల తేదీలు ఖరారు అవుతాయి. బిజినెస్‌కు సంబంధించిన విషయాల్లోనూ అప్పుడే స్పష్టత వస్తుంది’’ అంటున్నారు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌. ‘మైదాన్‌’ చిత్ర నిర్మాత బోనీకపూర్‌ మాట్లాడుతూ ‘‘నా సినిమాలను ప్రేక్షకులకు వెండి తెరపై చూపెట్టడమే నాకు ఇష్టం. ‘మైదాన్‌’ను అలాగే థియేటర్లో చూపెట్టాలనుకుంటున్నాను. ప్రపంచం అంతా చూసే గొప్ప చిత్రమది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ’’న్నారు.

మరిన్ని విడుదల కావాలి

‘‘ఈ ఏడాది రావాల్సిన కొన్ని పెద్ద చిత్రాలతో పాటు హాలీవుడ్‌ చిత్రాలూ ఆగిపోయాయి. వచ్చే ఏడాది ఇవన్నీ సందడి చేయబోతున్నాయి. వీటితో పాటు మరిన్ని చిత్రాలు త్వరగా చిత్రీకరణలు పూర్తి చేసుకుని 2021 విడుదల కావాల్సిన థియేటర్లకు ఎంతో అవసరం ఉంది’’అని ఓ ప్రముఖ బాలీవుడ్‌ ఎగ్జిబిటర్‌ చెబుతున్నారు. ‘‘థియేటర్లు మొదలైతే వచ్చే ఏడాది సందడి గట్టిగానే ఉంటుంది. ఇప్పటికే విడుదల తేదీల్ని ప్రకటించిన వాటితో పాటు మరిన్ని కొత్త చిత్రాలు వస్తాయి. ఈ సమయంలోనే పరిశ్రమ ఏకతాటిపై నడిచి క్లాష్‌ రాకుండా విడుదల తేదీల్ని ప్లాన్‌ చేసుకోవాలి’’అని చెబుతున్నారు సూజిత్‌ సర్కార్‌.


హాలీవుడ్‌ చిత్రాల సందడి

కరోనాతో హాలీవుడ్‌ సినిమాల విడుదల ఆగిపోయింది. హాలీవుడ్‌ చిత్రాలకు భారతదేశం అతిపెద్ద మార్కెట్‌. అందుకే అక్కడి నుంచి పలు చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. టామ్‌ క్రూజ్‌ ‘టాప్‌ గన్‌ మేవరిక్‌’, ఎమిలీ బంట్‌ ‘ఎ క్వైట్‌ ప్లేస్‌ పార్ట్‌ 2’ తో పాటు ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9, గోస్ట్‌బస్టర్స్‌ ఆఫ్టర్‌ లైఫ్‌’ తదితర చిత్రాలు 2021లో రానున్నాయి. ‘‘ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో థియేటర్లకు ఆశాజనక వాతావరణం కనిపిస్తుంది. దక్షిణ కొరియా, జపాన్, చైనా లాంటి దేశాల్లో థియేటర్లు తెరచుకున్నాయి. అక్కడ థియేటర్లకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇది శుభ పరిణామం’’అంటున్నారు పంపిణీదారుడు అక్షయ్‌ రతి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.