ఇంటా.. బయటా తనదే హవా

తాప్సి తెల్లారుజామునే నిద్ర లేస్తుంది. లేవగానే ఫోన్‌ తీసుకుని ఫేస్‌బుక్‌ చూడదు. ఇంటి ముందర దొడ్లో ఉన్న ఆవుల దగ్గరికెళ్లి పేడ ఎత్తేస్తుంది. ఆ తర్వాత పాలు పితుక్కొస్తుంది. ఇక కవ్వానికి తాడు బిగించి సుయ్‌ సుయ్‌మంటూ మజ్జిగ చిలుకుతుంది. ఇంటి పనులే కాదు.. పొలానికి వెళ్లి ట్రాక్టర్‌తో ఎంచక్కా దున్నేస్తుంది. పనులయ్యాక తుపాకీ చేతపట్టి షూటింగ్‌ సాధన చేస్తుంది. ఆమె వదిన భూమి పెడ్నేకర్‌కూ అదే వ్యాపకం. ఆ సరదానే వారికి పేరు తెచ్చిపెట్టింది. ఓ మారుమూల పల్లెటూళ్లో పుట్టిన వారు ప్రపంచంలోనే వయోవృద్ధులైన షూటర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి షూటింగ్‌ సత్తా ఏంటో తెలియాలంటే దీపావళికి రాబోతున్న ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ చిత్రం చూడాల్సిందే. రివాల్వర్‌ దాదీ, షూటర్‌ దాదీగా పేరు తెచ్చుకున్న 80 ఏళ్ల ప్రకాషి తొమార్‌, 87 ఏళ్ల చంద్రో తొమార్‌ల జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. తాప్సి, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తుషార్‌ హీరానందని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన పోస్టర్‌లను ఆన్‌లైన్‌లో పంచుకుంది తాప్సి. ఆమె మజ్జిగ చిలుకుతూ, రోకలి పట్టుకుని, ట్రాక్టర్‌ నడుపుతూ ఉన్న ఆ పోస్టర్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.