‘తలైవి’కి శోభన్‌బాబు దొరికేశారు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో తమిళంలో నాలుగైదు చిత్రాల వరకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. కానీ, వీటన్నింటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది మాత్రం ఏ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’నే. ఎందుకంటే.. ఈ చిత్రంలో జయ పాత్రను పోషించబోతుంది బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కంగనా రనౌత్‌. అంతేకాదు దీనికి ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. అయితే అమ్మ జీవితకథ అనగానే ఆమెతో సాన్నిహిత్యమున్న ప్రతి పాత్రనూ వెండితెరపై చూపించాల్సి ఉంటుంది. జయకు సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఎందరో మిత్రులు, శత్రువులు ఉన్నారు. వీరిలో రాజకీయ రంగానికి సంబంధించి ఎం.జి.ఆర్, కరుణానిధిల పాత్రలు కీలకమైనవి. ఇక సినీ రంగంలో అత్యంత కీలకమైనది శోభన్‌బాబు పాత్ర. ఎందుకంటే అప్పట్లో ఈ అందాల నటుడితో జయ ప్రేమలో ఉన్నట్లు.. ఒకానొక దశలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్లు రకరకాల వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ‘తలైవి’లో శోభన్‌బాబు పాత్ర ఎవరు చెయ్యబోతున్నారు? ఇందులో వీళ్లిద్దరి అనుబంధాన్ని ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. అయితే తాజాగా వీటిలో తొలి ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఈ చిత్రంలో సొగ్గాడి పాత్రలో కనిపించబోయే నటుడి గురించి ఓ క్లారిటీ వచ్చేసింది. మొదట ఈ పాత్రను విజయ్‌ దేవరకొండతో చేయించబోతున్నట్లు వార్తలొచ్చినప్పటికీ ఇప్పుడది వాస్తవం కాదని తెలిసిపోయింది. ఇప్పుడీ పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషు సేన్‌ గుప్తాని ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆయన ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలు చేశారు. బాలయ్య కథానాయకుడిగా నటించిన ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’లో ఎల్వీ ప్రసాద్‌గా కనిపించగా.. ఇటీవలే విడుదలైన ‘అశ్వథ్థామ’లో సైకో విలన్‌గా దర్శనమిచ్చి మెప్పించాడు. ఇప్పుడీయన్నే అమ్మ జీవితగాథలో శోభన్‌బాబుగా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ పాత్ర కోసం ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా అరవింద స్వామి.. కరుణానిధిగా ప్రకాష్‌రాజ్‌ కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.