వాణీ కపూర్‌ - ఆయుష్మాన్‌ల ప్రేమకథా చిత్రం!

బాలీవుడ్‌ వైవిధ్యమైన కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖుర్రానా ఇప్పుడు సరికొత్త ప్రేమకథలో నటించనున్నాడు. ఉత్తరభారత దేశానికి చెందిన ఓ రొమాంటిక్‌ ప్రేమకథా నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుంది. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వాణీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. చిత్రం అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక వాణీ కపూర్‌ స్పందిస్తూ..ఇది ఎంతో మనోరమైన ప్రేమకథ. నేను దర్శకుడు అభిషేక్ కపూర్‌తో కలిసి పనిచేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఆయన తీసిన చిత్రాలను తెరపై చూసి ఎంతో స్ఫూర్తిని పొందాను. ఇప్పుడీ చిత్రంలో భాగం అవ్వడం నా అదృష్టం. ఇలాంటి అద్భుతమైన చిత్రంలో ఆయుష్మాన్‌తో కలిసి తొలిసారిగా నటించడం అంటే నమ్మలేకపోతున్నానని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ నటి వాణీ గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా నిబద్ధత కలిగిన నటీ. ఇక ఆయుష్మాన్‌ ఖుర్రానా గురించి చెప్పాల్సిన పనిలేదు. వారిద్దరి మధ్య తెరపై మంచి కెమిస్ట్రీ పండుతుందని ఆశిస్తూ..ఎదురు చూస్తున్నా అని చెప్పారు. ఇక నటుడు ఆయుష్మాన్‌ చిత్రం గురించి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..చిత్రం కోసం నేను చాలా కష్టపడుతున్నా. ఈ సినిమా పాత్ర కోసం భౌతికంగా శరీరంలో కొన్ని మార్పులు అవసరమయ్యాయి. ఆ మార్పులో భాగంగా నాకు తీవ్రమైన బాధ కూడా కలిగింది. అయినా వెనక్కు తగ్గేది లేదు. ఈ సారి తెరపై నేను పూర్తి వైవిధ్యంగా కనిపిస్తాను. ప్రేక్షకులు నన్ను ఈసారి ఓ కొత్తరూపంలో చూస్తారు. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఇలాంటి బాధలు ఎన్నైయినా సరే భరిస్తాను అంటూ చెప్పకొచ్చారు. వాణీ కపూర్‌ - ఆయుష్మాన్‌ ఖుర్రానాల మధ్య కెమిస్ర్టీ వెండితెరపై అందరిని ఆకట్టుకునేలా ఉండనుందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ గతంలో రాక్ ఆన్ కై పో చే, కేదార్‌నాథ్‌లాంటి చిత్రాలను తెరకెక్కించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.