ఆసక్తికరంగా ‘కళంక్‌’ టీజర్‌

వరుణ్‌ ధావన్, సంజయ్‌ దత్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా, మాధురీ దీక్షిత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘కళంక్‌’. అభిషేక్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర ప్రధాన పాత్రధారుల ఫస్ట్‌లుక్‌లు విడుదల చేయగా.. తాజాగా చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం 1945లో భారత్‌లోని ఓ యువరాణికీ, ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువకుడికీ మధ్య పుట్టిన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్‌లో యువరాణి రూప్‌గా ఆలియా లుక్, వరుణ్‌ ధావన్‌ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌లోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో రిచ్‌గా తీసినట్లు కనిపిస్తోంది. ఈ భారీ పీరియాడికల్‌ చిత్రం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఒకరిని నాశనం చేస్తేనే అది మన విజయమవుతుందంటే.. ఈ ప్రపంచంలో మనకంటే ఓటమిపాలైనవారు మరొకరుండరు’’ అంటూ టీజర్‌ చివర్లో వినిపించిన డైలాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.