రూ.200 కోట్ల క్లబ్‌లో.. ‘కబీర్‌ సింగ్‌’


తెలుగు హిట్‌ చిత్రం ‘అర్జున్‌రెడ్డి’ హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ అయి అక్కడ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మాతృకను తెరకెక్కించిన సందీప్‌ వంగానే హిందీ వెర్షన్‌కూ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. షాహిద్‌ కపూర్‌ - కియారా అడ్వాణీ నాయకానాయికలుగా నటించారు. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజు నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు అందుకొంటోంది. ఈ నేపథ్యంలోనే తొలి వారంలో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు రూ.200 కోట్ల మార్కును దాటేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తాజాగా ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. భారత్‌లో బుధవారం నాటికి కబీర్‌ రూ.206.48 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు వెల్లడించారు. దీంతో పాటు ‘‘కబీర్‌ సింగ్‌ 200 నాట్‌ అవుట్‌’.. బాక్సాఫీస్‌ వద్ద డబుల్‌ సెంచరీ కొట్టాడు. కానీ, ఇంకా అలిసిపోయినట్లు కనిపించట్లేదు’’ అని క్రికెట్‌ స్టైల్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. అంతేకాదు.. ఈ ఏడాది అత్యంత వేగంగా రెండొందట కోట్ల క్లబ్‌ను చేరుకున్న బాలీవుడ్‌ చిత్రమూ ఇదేనని తరణ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మార్క్‌ను చేరుకోవడానికి ‘ఉరీ’కి 28 రోజులు, సల్మాన్‌ భారత్‌కు 14 రోజులు సమయం పట్టగా.. ‘కబీర్‌’ కేవలం 13 రోజుల్లోనే ఆ క్లబ్‌ను చేరుకోవడం విశేషం. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే రూ.250 కోట్లు దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.




View this post on Instagram

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.