* ఓ హత్య... ఓ నవల...రెండు సినిమాలు

అమెరికాలో 1906లో ఓ స్కర్ట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ అమ్మాయి హత్య జరిగింది. సంచలనం సృష్టించిన ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని 1925లో థియొడోర్‌ డ్రైసర్‌ అనే రచయిత ‘ఏన్‌ అమెరికన్‌ ట్రాజెడీ’ అనే నవల రాస్తే అది అందరినీ ఆకట్టుకుంది. ఆ కథ ఆధారంగా నాటకం రూపొందిదే ప్రేక్షకులు విరగబడి చూశారు. అదే కథ ఆధారంగా వెండితెరపై రెండు సినిమాలు వచ్చాయి. మొదటగా 1931లో వచ్చిన ‘ఏన్‌ అమెరికన్‌ ట్రాజెడీ’ సినిమా జనాదరణ పొందింది. అదే నవల ఆధారంగా 1951లో ‘ఎ ప్లేస్‌ ఇన్‌ ద సన్‌’ అనే సినిమాను తీశారు. జార్జి స్టీవెన్స్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలై ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆరు ఆస్కార్‌ అవార్డులు, ఒక గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు సహా అనేక పురస్కారాలు గెలుచుకుంది. దీన్ని అప్పట్లో 2.3 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే 7 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ఈ సినిమాలో అందాల తారలు ఎలిజెబెత్‌ టేలర్, షెల్లీ వింటర్స్‌ నటించారు.


కథ విషయానికి వస్తే ఓ పేద యువకుడు పట్నంలో తన మేనమామ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వస్తాడు. అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఎవరితోనూ చనువుగా ఉండకూడదనే షరతు విధిస్తారు. కానీ ఆ యువకుడు తన తోటి పేద యువతితో ప్రేమలో పడతాడు. మరో పక్క అతడు కష్టపడి పని చేస్తూ మేనమామ ఆదరణ పొంది ఉద్యోగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఓ పెద్ద పార్టీలో అతడికి మరో అందమైన యువతి తారసపడుతుంది. ఆమె అతడిని ఇష్టపడుతుంది. ఈ ఇద్దరు యువతులతో సాన్నిహిత్యం అతడి జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది, ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనేదే సినిమా.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.