గతం గురించి పట్టించుకోను
అగ్ర కథానాయకుడు....వైవిధ్యమైన కథలు...ఈ రెండింటికీ జోడీ కుదరడం అరుదు. కొద్దిమంది కథానాయకులే అలాంటి సాహసాలు చేస్తారు. అలాంటి సాహసాల బాటే నాకు ఇష్టం అంటుంటారు ఆమీర్‌ఖాన్‌. పలు కొత్తరకమైన కథల్లో నటించి వాటిని బాక్సాఫీసు వద్ద పరుగులు పెట్టించేలా నటించే సత్తా ఉన్న నటుడాయన. ‘కయామత్‌ సే కయామత్‌ తక్‌’ నుంచి ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ వరకూ ఆయన ముఫ్పై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు. ఆ ప్రయాణం గురించి, నిర్మాతగా తన కొత్త చిత్రం గురించి ఆమీర్‌ చెప్పిన ఆసక్తికర సంగతులు...

‘‘నేను గతం గురించి పట్టించుకోను. ఈ రోజు ఏంటి? అనేదే నాకు ముఖ్యం. అప్పుడప్పుడు నా పాత స్నేహితుల్ని కలిసినప్పుడు అప్పట్లో నేను నటించిన చిత్రాల ప్రస్తావన వస్తుంటుంది. అది నాకు అస్పలు నచ్చదు. కెరీర్‌ మొదట్లో నేను నటించిన చిత్రాలు చూడటమే నాకు ఇష్టం ఉండదు. అంతెందుకు నేను నటించిన ఓ సినిమాని సంవత్సరం తర్వాత చూస్తేనే అందులో నాకు ఎన్నో తప్పులు కనిపిస్తాయి. ఆ సీన్‌ అలా చేస్తే బాగుండునేమో... ఈ సీన్‌ రీ షూట్‌ చేయాల్సిందేమో అంటూ ఆలోచనలు ప్రవాహంలా వస్తాయి. నన్ను కొంతమంది మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అంటుంటారు. సినిమాకు సంబంధించినంతవరకూ పర్‌ఫెక్షన్‌ అంటూ ఏదీ ఉండదు. సాధ్యమైనంతలో పనిచేయడం తప్పితే వందశాతం చేయడం కుదరదు’’.ఎప్పుడూ నాది అదే ఫార్ములా
‘‘విజయానికి మీదగ్గర ఏదో కోడ్‌ ఉందని నాతో కొందరన్నారు. నాకు అలాంటివేమీ తెలియవు. అదే తెలిస్తే ప్రతి సినిమా కోసం తొలి చిత్రంలాగానే కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? ప్రతి కథలోనూ కొత్తదనం కోసం ఎందుకు వెతకాలి? నా వద్దకు వచ్చే ఏ కథనైనా సాధారణ ప్రేక్షకుడి దృష్టితోనే చదువుతాను, వింటాను. ఆ కథ నా కళ్ల ముందు కదలాలి. నన్ను కదిలించాలి. నా మనసుని తాకాలి. అలా జరిగితేనే ఆ కథను ఓకే చేస్తాను. ఆ తర్వాత ఆ కథను ఎంత బాగా అర్థం చేసుకోగలను, ఎంత చక్కగా దాన్ని తెరపై ప్రదర్శించగలను అనేది చాలా ముఖ్యం. ప్రతి సినిమాకు అదే ఫార్ములా’’.

నప్పని వాటికి దూరంగా
‘‘మంగళ్‌ పాండే’ చిత్రానికి ముందు, తర్వాత అంటూ నా కెరీర్‌ గురించి మాట్లాడారు. కానీ సినిమాపై నా ఆసక్తి అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. 1988లో వచ్చిన నా తొలి సినిమా ‘కయామత్‌ సే కయామత్‌ తక్‌’కు 1998- 2000 మధ్య నేను పనిచేసిన ‘లగాన్‌’కు మధ్య ఓ తేడా అయితే ఉంది. ‘లగాన్‌’ తర్వాత నేను ధైర్యంగా ముందడుగు వేసే అవకాశం వచ్చింది. నా అభిరుచికి అనుగుణంగా కథలు ఎంచుకునే వీలు కలిగింది. నాకు నప్పని కథలకు దూరంగా వెళ్లగలిగాను. ‘రాజా హిందుస్తానీ’ కూడా మంచి విజయమే సాధించింది. కానీ అది నా తరహా చిత్రం కాదు. ‘లగాన్‌’, ‘దిల్‌ చాహ్‌తా హై’, ‘తారే జమీన్‌ పర్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘రంగ్‌ దే బసంతి’, ‘సర్ప్‌రోష్‌’...ఇవన్నీ నా తరహా చిత్రాలు. 1998 నుంచే కథల ఎంపికలో మరింత దూకుడుగా వెళ్లడం మొదలుపెట్టాను’’.

బుల్లితెరతోనే సాధ్యమనుకున్నా.!
‘‘నేను ఓ సినిమాలో నటిస్తున్నా... నిర్మిస్తున్నా ఎలాంటి ఒత్తిడికి గురికాను. ఎందుకంటే నేను నా పనిలో నిమగ్నమవుతాను. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు చూపించాలనే ఒత్తిడి అయితే ఉంటుంది. నేను కొత్తగా నిర్మించిన చిత్రం ‘రుబారు రోషిణి’ గురించీ ఇలాగే ఒత్తిడికి లోనయ్యా. ఈ చిత్ర దర్శకురాలు స్వాతి చక్రవర్తి భత్కల్‌ చెప్పిన కథ చాలా బాగుంది. అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమా ఒక్కసారి చూస్తేనే నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. ప్రత్యేకంగా కొంతమందికి చూపించినప్పుడు నాలాగే వాళ్లూ స్పందించారు. దర్శకురాలు చెప్పిన ఈ సినిమా కథ విన్నప్పుడు నేను నా భార్య ఈ కథతో ప్రేమలో పడిపోయాం. కచ్చితంగా ఈ కథను తెరకెక్కించాలనుకున్నాం. ఈ సినిమాని ఏ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులకు తీసుకెళ్లాలో ముందు ఆలోచించలేదు. తొలి కాపీ వచ్చాక ఇది దేశమంతా చూడాల్సిన కథ అనుకున్నాం. దేశం మొత్తం థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేదు. సూపర్‌ హిట్‌ సినిమాల్ని చూసిన ప్రేక్షకులు కేవలం జనాభాలో రెండో వంతే. అందుకే ఎక్కువ మందికి చేరువకావాలంటే బుల్లితెరే సరైందని దాన్ని ఎంచుకున్నాను. ఈ చిత్రాన్ని ఏడు భాషల్లోకి అనువదించాం’’.
మరో నెల సమయం
‘‘గజనీ 2’, ‘మహాభారత్‌’...ఇలా నా తదుపరి చిత్రాల గురించి పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాటిలో దేని గురించి నేను స్పందించలేను. ఎందుకంటే చాలా కథలు విన్నాను. వాటిలో నా మనసుకు బాగా నచ్చిన వాటి గురించి నేను చెప్పాలి. దానికి మరో నెల సమయం పడుతుంది’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.