చూడముచ్చటైన జంట

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్, నటి జయబాధురిల పెళ్లి రోజు (జూన్‌ 3, 1973). సహనటులైన వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తొలిసారిగా జయబాధురి 1970లో అమితాబ్‌ను పూణెలోని ఓ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చూసింది. అప్పటికి ఆమె పేరు తెచ్చుకున్న నటీమణి. ఆమె ఫొటో ఓ సినిమా పత్రిక ముఖచిత్రంపై చూసిన అమితాబ్‌ చూస్తూనే ఇష్టపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నమాట. తర్వాత వీరిద్దరూ కలిసి 1971లో ‘గుడ్డి’ సినిమాలో కలిసి నటించారు. అప్పుడే పరిచయం పెరిగింది. తర్వాత 1973లో ‘జంజీర్‌’ సినిమాకల్లా వీరిద్దరూ ప్రేమలో మునిగారు. ఒక దశలో అమితాబ్‌ను నీకు తగినవాడు కాడంటూ రాజేష్‌ఖన్నా కూడా జయబాధురిని వారించాడని చెబుతారు. అయితే జంజీర్‌ విజయోత్సవాన్ని ఇద్దరూ కలిసి లండన్‌లో జరుపుకుందామనుకున్నారు. ఒంటరిగా పంపేదిలేదని జయబాధురి తల్లిదండ్రులు చెప్పడంతో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుని మరీ లండన్‌ వెళ్లారు. వీరికి 1974లో శ్వేత పుట్టింది. మూడేళ్ల తర్వాత అభిషేక్‌ పుట్టాడు. శ్వేత నిఖిల్‌ నందను పెళ్లిచేసుకుంది. వారికి నవ్య నవేలి నంద, అగస్త నంద సంతానం. అభిషేక్‌ ఐశ్వర్యరాయ్‌ని పెళ్లి చేసుకోగా వారికి ఆరాధ్య పుట్టింది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.