గాంధీ మా నాన్నను కాపాడారు: అమితాబ్‌
article image
ముంబయి: అవి 1933 నాటి రోజులు. అప్పట్లో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ భారతదేశంలో పేరున్న రచయిత. 1933లో హరివంశ్‌ రాయ్‌ ‘మధుశాల’ అనే నవల రాశారు. 1935లో ఈ పుస్తకం ప్రచురితమైంది. అయితే అందులో యువతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని ఇందుకు హరివంశ్‌రాయ్‌ని అరెస్ట్‌ చేయాలని కొందరు ఆందోళన చేశారు. తాజాగా ఈ విషయాన్ని అమితాబ్‌ బచ్చన్‌ గుర్తుచేసుకుంటూ ఓ ట్వీట్‌ పెట్టారు.
‘ మా నాన్న 1933లో ‘మధుశాల’ అనే నవల రాశారు. ఇప్పటికీ ఈ నవలకు ప్రేక్షకులలో ఎంతో ఆదరణ ఉంది. అయితే తండ్రి రాసిన నవల యువతను చెడు మార్గంలో నడిపించే విధంగా ఉందని అతన్ని అరెస్ట్‌ చేయాలని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు చేశారు. ఈ విషయం గురించి మహాత్మా గాంధీకి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో గాంధీ నుంచి మా నాన్నకు పిలుపు వచ్చింది. నాన్న గాంధీ వద్దకు వెళ్లినప్పుడు ‘నువ్వు రాసిన నవలలో ఏముందో నేను వినాలనుకుంటున్నాను’ అన్నారు. మా నాన్న ఆయన చెప్పినట్టే కొన్ని వ్యాఖ్యలు, పద్యాలు చదివి వినిపించారు. ఇవన్నీ విన్న గాంధీ.. ‘ఇందులో అభ్యంతరం చెప్పాల్సినంతగా ఏమీ లేదే’ అన్నారు. దాంతో మా నాన్న ఊపిరి పీల్చుకున్నారు. అలా ఆందోళనకారుల నుంచి మా నాన్నను గాంధీ కాపాడారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు బచ్చన్‌.
అమితాబ్‌ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా ఈ సారి తన తండ్రి విషయంలో జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.