ఈ చిన్నారి నా కోసం వచ్చింది: అమితాబ్‌
article image
ముంబయి: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కి అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఆదివారం వందలాది మంది అభిమానులు అమితాబ్‌ని చూడటానికి ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు. వారి కోసం అమితాబ్‌ బయటికి వచ్చి ఓ స్టూల్‌పై నిలబడి అభివాదం చేస్తుంటారు. వారి మాటలు విని, బదులిస్తుంటారు. అప్పుడప్పుడూ ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు కూడా ఇస్తుంటారు.
ఎప్పటిలాగే మొన్న ఆదివారం అమితాబ్‌ను చూసేందుకు అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే బిగ్‌బి వారిని పలకరిస్తుండగా గుంపులోంచి ఓ చిన్నారి నేరుగా అమితాబ్‌ వద్దకు వెళ్లిపోయింది. ఆ చిన్నారి ధైర్యాన్ని చూసి అమితాబ్ ఆశ్చర్యపోయారు. పాపతో కలిసి దిగిన ఫొటోలను అమితాబ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఆదివారం నా ఇంటి వద్దకు వచ్చిన అభిమానుల గుంపును దాటుకుంటూ హాయ్‌ చెప్పడానికి ఈ చిన్నారి నా కోసం వచ్చింది. ‌సో క్యూట్‌’ అని అమితాబ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమితాబ్‌ ‘102 నాటౌట్‌’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, ‘బ్రహ్మాస్త్రా’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.