ఆయుష్‌ మళ్లీ అదరగొట్టేశాడట..

ఆయుష్మాన్‌ ఖురానా.. ఇప్పుడీ పేరు బాలీవుడ్‌లో వైవిధ్యభరిత కథలకు చిరునామా. ‘విక్కీ డోనర్‌’ చిత్రంతో ఈ తరహా ప్రయాణాన్ని షురూ చేసి సినీప్రియుల మనసు దోచిన ఆయుష్‌.. అక్కడి నుంచి అదే బాటను తన రహదారిగా మార్చుకున్నారు. ఒక చిత్రానికి మరో చిత్రానికి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ఉత్తరాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ‘అంధాధున్‌’, ‘బదాయి హో’ వంటి చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకోవడమే కాక ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలోనూ మెరిశారు. ఈ జోరులోనే ఈ ఏడాది ‘ఆర్టికల్‌ 15’, ‘డ్రీమ్‌ గర్ల్‌’ చిత్రాలతో వైవిధ్యభరిత ప్రయాణాన్ని కొనసాగించిన ఆయుష్‌.. తాజాగా ‘బాలా’ అంటూ మరో ప్రయోగాత్మక కథతో థియేటర్లలోకి వచ్చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి బాలీవుడ్‌ సినీప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బట్టతల సమస్యతో బాధపడే కుర్రాడిగా ఆయుష్‌ కనబర్చిన నటన థియేటర్లో నవ్వులు పూయిస్తోందట. ముఖ్యంగా ఈ చిత్ర విజయంలో దర్శకుడు అమర్‌ కౌశిక్‌ పాత్ర కూడా ఎంతో ఉందట. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే విషయంలో అతనో పెద్ద మ్యాజిక్‌నే క్రియేట్‌ చేశారట. ఇటీవల కాలంలో బాలీవుడ్‌ తెరపై ఇంత చక్కటి స్క్రీన్‌ప్లేతో వచ్చిన మరో కథాంశమేదీ లేదంటే అతిశయోక్తి కాదట. ఇక తన బట్టతల సమస్యను కవర్‌ చేసుకుంటూ యామి గౌతమ్‌ను ప్రేమలో దింపేందుకు అష్టకష్టాలు పడే యువకుడిగా ఆయుష్‌ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడట. ఇది ఆయనకు మరో అవార్డు విన్నింగ్‌ చిత్రమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారట. ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్‌ మీడియా నుంచి వచ్చిన రివ్యూలు సైతం చాలా పాజిటీవ్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయుష్‌ మరోసారి బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.