బాలీవుడ్‌ బాతాఖానీ
2019కి శుభం కార్డు పడబోతోంది. ఈ ఏడాది వెండితెర ఊహించని ఫలితాల్నిచ్చింది. భారీ హంగులతో వచ్చిన కొన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడితే మరికొన్ని చిత్రాలు అంచనాలను మించి సంచలనం సృష్టించాయి. మల్టీస్టారర్లకు దీటుగా చిన్న చిత్రాలు చెలరేగిపోయాయి. కొందరు హీరోలకు ఈ ఏడాది కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాలను అందించింది. నాయికా ప్రాధాన్య చిత్రాలను ఆశీర్వదించింది. మరి ఈ ఏడాది బాలీవుడ్‌ ప్రయాణం ఎలా సాగిందో చూసేయండి.


ఏదైనా మంచి కథ చెప్పు..’
‘సరే. ఓ కొత్త కథ చెబుతా..’
‘కొత్త కథైనా చెప్పు.. లేదా పాత కథనే కొత్తగా చెప్పు. అరువు కథైనా ఫర్లేదు. పొరుగు కథైనా ఫర్లేదు. ముత్తాతల నాటి చరిత్రైనా వింటా. కాలేజీ పిల్లల టీనేజీ ప్రేమ కబుర్లైనా వింటా. జీవితకథైనా ఓకే. జీవన వ్యథైనా ఓకే...’
‘అబ్బబ్బా.. ఇంతకీ ఎలాంటి కథ కావాలి నీకు’
‘ఏ కథ చెప్పినా ఇప్పటివరకూ ఎవరూ చెప్పనంత కొత్తగా చెప్పు’

- నేటి తరం ప్రేక్షకులు కోరుకుంటున్నది ఇదేనని ఈ ఏడాది వారు మెచ్చిన సినిమాలను గమనిస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కొత్త కథనంతో తెరకెక్కిన చిత్రాలు బడ్జెట్‌తోనూ, తారాగణంతోనూ సంబంధం లేకుండా విజయాన్నందుకున్నాయి. వాటిలో రీమేకులు, చారిత్రక చిత్రాలు, బయోపిక్‌లు, ప్రేమకథలు, సమకాలీన అంశాలను స్పృశించిన కథలు ఇలా అన్నీ ఉన్నాయి. కానీ కథనాన్ని కాకుండా హంగులనే నమ్ముకున్న చిత్రాలకు నిరాశే ఎదురైంది.

రీమేకులకు కాసుల వర్షం
ఈ ఏడాది అరువు కథలు బాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపించాయి. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘భారత్‌’.. దక్షిణ కొరియా చిత్రం ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ ఆధారంగా తెరకెక్కింది. కత్రినా కైఫ్‌, దిశా పటాని నాయికలుగా నటించిన ఈ చిత్రం రూ.210 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘కబీర్‌ సింగ్‌’ అక్కడా విజయం సాధించింది. షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ జంటగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు రూ.280 కోట్లు వసూలు చేసింది. స్పానిష్‌ చిత్రం ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ ఆధారంగా అమితాబ్‌ బచ్చన్‌, తాప్సి నటించిన చిత్రం ‘బద్లా’ రూ.88 కోట్లు అందుకుంది. కార్తిక్‌ఆర్యన్‌ నటించిన చిత్రం ‘పతి పత్ని ఔర్‌ వో’. 40 ఏళ్ల క్రితం అదే పేరుతో వచ్చిన చిత్రానికిది రీమేక్‌. రూ.80 కోట్ల వసూళ్లు అందుకుంది.

చారిత్రక చిత్రాల జయభేరి
ఈ ఏడాదీ చారిత్రక చిత్రాలు పలకరించాయి. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా వచ్చిన ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’లో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించింది. క్రిష్‌తో కలసి కంగన తెరకెక్కించిన ఈ చిత్రం రూ.100 కోట్లు వసూళ్లందుకుంది. అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘కేసరి’.. 1897లో జరిగిన సిన్హాగఢ్‌ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం రూ.153 కోట్లు వసూలు చేసింది. మూడో పానిపట్‌ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ‘పానిపట్‌’ నిరాశపరిచింది.

జరిగిన కథలకు జేజేలు
పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన మెరుపుదాడుల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’. విక్కీ కౌషల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రూ.245 కోట్ల వసూళ్లు అందుకుంది. మంగళ్‌యాన్‌ ప్రయోగం నేపథ్యంలో రూపొందిన ‘మిషన్‌ మంగళ్‌’లో అక్షయ్‌ కుమార్‌, విద్యా బాలన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లందుకుంది. ఐఐటీ శిక్షకుడు ఆనంద్‌ కుమార్‌ జీవితకథతో హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సూపర్‌30’ రూ.146కోట్లు అందుకుంది. ర్యాప్‌ గాయకులు డివైన్‌, నేజీల జీవితకథతో తెరకెక్కిన చిత్రం ‘గల్లీబాయ్‌’. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.140 కోట్లు వసూలు చేసింది. బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ ఆధారంగా రూపొందిన చిత్రం ‘బాట్లా హౌస్‌’. జాన్‌ అబ్రహమ్‌ పోలీస్‌గా నటించారు. ఈ చిత్రం రూ.98 కోట్లు సాధించింది. వయోవృద్ధులైన షూటర్లు ప్రకాషి తోమర్‌, చంద్రో తోమర్‌ల జీవితకథతో తెరకెక్కిన చిత్రం ‘శాండ్‌ కీ ఆంఖ్‌’. తాప్సి, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రశంసలందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథతో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది.

సీక్వెల్స్‌కు సై
హౌస్‌ఫుల్‌ 4’లో అక్షయ్‌ కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రూ.206 కోట్ల వసూళ్లు అందుకుంది. అజయ్‌ దేవగణ్‌, అనిల్‌ కపూర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘టోటల్‌ ధమాల్‌’ రూ.155 కోట్లు వసూలు చేసింది. టైగర్‌ ష్రాఫ్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ ఆకట్టుకోలేదు. సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌ 3’ తొలి వారంలోనే రూ.126 కోట్లు వసూలు చేసి దూసుకెళ్తోంది. రాణీ ముఖర్జీ ‘మర్దానీ 2’ రూ.40 కోట్లకు పైగా వసూలు చేసింది. విద్యుత్‌ జమ్‌వాల్‌ ‘కమాండో 3’ రూ.33 కోట్లు
వసూలు చేసింది.

వీటికి నిరాశే
వరుణ్‌ ధావన్‌, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌, మాధురీ దీక్షిత్‌, సోనాక్షి సిన్హా తదితర తారాగణంతో భారీ అంచనాలతో వచ్చిన ‘కళంక్‌’ బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. అనిల్‌ కపూర్‌, జాన్‌ అబ్రహమ్‌, ఇలియనా తదితరులు నటించిన ‘పాగల్‌పంటి’ ఆకట్టుకోలేకపోయింది. ప్రియాంక చోప్రా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’, రాజ్‌కుమార్‌ రావ్‌ ‘మేడిన్‌ చైనా’, సోనమ్‌ కపూర్‌ ‘ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’, సోనాక్షి సిన్హా ‘ఖాన్‌దానీ సఫాఖానా’ మెప్పించలేదు.


యాక్షన్‌కు జై
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ‘వార్‌’. హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రమిది. హృతిక్‌, టైగర్‌లపై తెరకెక్కించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చాయి. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రం రూ.318 కోట్లకు పైగా వసూళ్లందుకుంది. ప్రభాస్‌ ‘సాహో’కు హిందీలో మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హిందీలో ఈ చిత్రం సుమారు రూ.150 కోట్లు అందుకుంది. ఇవే కాక ఈ ఏడాది అజయ్‌ దేవగణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు నటించిన ‘దే దే ప్యార్‌ దే’ కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రం రూ.102 కోట్లు అందుకుంది. ఇటీవలే విడుదలైన అక్షయ్‌ కుమార్‌ ‘గుడ్‌న్యూస్‌’ రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి జోరు చూపిస్తోంది. కంగనా రనౌత్‌ ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ ఫర్వాలేదనిపించింది.
చిన్న హీరోలకు శుభం

ఆయుష్మాన్‌ ఖురానా ఈ ఏడాది ‘ఆర్టికల్‌ 15’, ‘డ్రీమ్‌ గర్ల్‌’, ‘బాలా’ చిత్రాలతో విజయాలందుకున్నారు. ‘ఆర్టికల్‌ 15’ రూ.63 కోట్లు, ‘డ్రీమ్‌ గర్ల్‌’ రూ.140 కోట్లు, ‘బాలా’ రూ.117 కోట్లు వసూలు చేశాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, శ్రద్ధా కపూర్‌ నటించిన ‘చిచ్చొరే’ రూ.150 కోట్లు అందుకుంది. కార్తిక్‌ ఆర్యన్‌ నటించిన ‘లుకా చుప్పి’ రూ.95 కోట్లు వసూలు చేసింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.