మూడు నెలల్లో దీపిక వివాహం?
article image
ముంబయి: బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇక వరుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రణ్‌వీర్‌ సింగ్‌-దీపిక పదుకొణె ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నేరుగా వెల్లడించకపోయినా ‘నేను రణ్‌వీర్‌తో ఉంటే ఇంకెవ్వరూ అక్కర్లేదనిపిస్తుంది’ అని చెప్పారు.
అయితే వీరిద్దరికీ వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు బీటౌన్‌ టాక్‌. రణ్‌వీర్‌ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు దీపిక తల్లిదండ్రులు బెంగళూరు నుంచి ముంబయి వచ్చినట్లు సమాచారం. పెళ్లి గురించి ఇరు కుటుంబాలు చర్చించుకున్నాక సరదాగా అందరూ కలిసి ముంబయిలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో డిన్నర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో మూడు నెలల్లో దీపిక-రణ్‌వీర్‌ వివాహం జరిగే అవకాశం ఉంది.
విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ లాగే వీరిద్దరు కూడా విదేశాల్లో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. కానీ రణ్‌వీర్‌ తల్లిదండ్రులు మాత్రం ముంబయిలోనే పెళ్లి జరిగాలని..బంధవులంతా ముంబయిలోనే ఉన్నారని అంటున్నారట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ముంబయిలోని తాజ్‌ ల్యాండ్స్‌ ఎండ్‌, ఫోర్‌ సీజన్స్‌, సెయింట్‌ రెగిస్..ఈ మూడింట్లో ఏదో ఒక హోటల్‌లో వివాహం జరిగే అవకాశం ఉంది. దక్షిణ భారతీయ సంప్రదాయం ప్రకారమే వివాహ వేడుకను జరిపిస్తారట. ఆ తర్వాత ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులకు గ్రాండ్‌గా విందు ఏర్పాట్లు ఉంటాయట.
మరోపక్క దీపిక రణ్‌వీర్‌ తల్లిదండ్రులతో కలిసి లండన్‌లో షాపింగ్‌ చేస్తు్న్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. రణ్‌వీర్‌ ‘గల్లీబాయ్‌’ చిత్రంతో బిజీగా ఉండడంతో షాపింగ్‌కు వెళ్లలేకపోయారట. ప్రస్తుతం దీపిక ‘సప్నా దీదీ’ అనే బయోపిక్‌లో నటిస్తున్నారు. ముంబయిలోని నాగ్‌పాడాకు చెందిన మాఫియా క్వీన్‌ రహీమా ఖాన్ జీవితాధారంగా ఈ సినిమాను విశాల్‌ భరద్వాజ్‌ తెరకెక్కిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.