‘లయన్‌’ వాయిస్‌ వినేయండి

హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మక చిత్రాలు తెరకెక్కించే సంస్థలో ‘డిస్నీ’ ఒకటి. 2016లో విడుదలైన ‘ది జంగిల్‌ బుక్‌’ సినిమా తర్వాత ఈ సంస్థ ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రంతో మరో అద్భుతం సృష్టించనుంది. సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చి సింహాలకు సంబంధించిన కథతో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన మరో విషయం.. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుఖ్‌ ఖాన్, అతని కుమారుడు ఈ సినిమాలోని పాత్రలకు తమ గాత్రాన్ని అందించడం. ఇటీవలే షారుఖ్‌ డబ్బింగ్‌ చెప్తున్న ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తన హావభావాలతో ఖాన్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ‘ముఫాసా’ పాత్రకు షారుఖ్, ‘సింబా’కు తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ వాయిస్‌ అందిస్తున్నారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో జులై 29న విడుదల కానుందీ ఈ చిత్రం. ఇతర భాషల్లో ఎవరు డబ్బింగ్‌ చెప్పారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలున్నాయి. ‘ఐరన్‌ మ్యాన్‌’, ‘ది జంగిల్‌ బుక్‌’ చిత్రాల దర్శకుడు జాన్‌ ఫేర్యూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.