ప్రేమ కానుక... ట్రక్కు నిండా గులాబీలు!

అలనాటి బాలీవుడ్‌ నటి జూహీ చావ్లా పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చే చిత్రం ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’. అమీర్‌ ఖాన్‌తో కలిసి నటించిన చిత్రానికిగాను జూహీ చావ్లాకి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. ఆ తరువాత అగ్రహీరోలైన షారుక్‌ ఖాన్, సన్నీ డియోల్, అక్షయ్‌ కుమార్‌తో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. 1990లో నాటి కథానాయిక మాధురీ దీక్షిత్‌కి గట్టిపోటీనే ఇచ్చింది. తాజాగా ఆమె తన ప్రేమపెళ్లి గురించి ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ ‘‘అప్పట్లో మా ఆయన జై.మెహతా ఎక్కడికి వెళ్లినా వెంటపడేవాడు. పువ్వులు, బాహుమతులు ఇచ్చేవాడు. అలా ఒకసారి నా పుట్టినరోజు సందర్భంగా ఒక ట్రక్కు ఎర్రని గులాబీ పువ్వులను పంపించాడు. అది నాకు బాగా గుర్తు. ఎవరైనా ట్రక్కు పూలతో ఏం చేస్తారు. అలా ఆయన చేయాల్సిన పనులు అన్నీ చేశాడు. ఒక సంవత్సరం తరువాత తన ప్రేమను నాతో చెప్పాడు’’ అంటూ ఆనాటి తన ప్రేమకథని చెప్పింది. 1995లో పెళ్లి చేసుకొన్న ఈ ప్రేమజంటకు జాన్వి, అర్జున్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెలుగులో నాగార్జునతో కలిసి ‘విక్కీదాదా’లో నటించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిబంద్‌’ అనే హిందీ చిత్రంలో చిరంజీవి కలిసి నటించింది. తెలుగులో వచ్చిన ‘అంకుశం’ చిత్రానికి ఇది రీమేక్‌ చిత్రం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.